Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ లో కుంతియా తుఫాన్‌

By:  Tupaki Desk   |   18 Aug 2017 4:50 AM GMT
టీ కాంగ్రెస్ లో కుంతియా తుఫాన్‌
X
తెలంగాణ కాంగ్రెస్ లో కుంతియా తుఫాన్ మొద‌లైంది. ఇంత‌కాలం పార్టీలో అంత‌ర్గ‌తంగా ఉన్న అసంతృప్తుల విష‌యంలో అధినాయ‌క‌త్వం స‌రైన నిర్ణ‌యాన్ని తీసుకుంటుద‌న్న ఆశ‌తో ఉన్న అసంతృప్త నేత‌ల‌కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ చార్జి కుంతియా చేసిన వ్యాఖ్య‌లు ఒళ్లు మండేలా చేశాయి. 2019 వ‌ర‌కు పార్టీ ప‌ద‌వుల్లో ఎలాంటి మార్పులు ఉండ‌వంటూ ఆయ‌న చెప్పిన మాటపై ఇప్పుడు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎన్నిక‌ల వ‌ర‌కూ ఇదే టీం ఉంటుంద‌ని.. ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి మాటే ఫైన‌ల్ అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది.

ఇటీవ‌ల కాలంలో టీ కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల కార‌ణంగా పార్టీ బ‌ల‌ప‌డుతోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. కుంతియా నోటి నుంచి వ‌చ్చిన మాట పరిస్థితిని మ‌రింత దిగ‌జార్చ‌ట‌మే కాదు.. పార్టీలో కొత్త స‌మీక‌ర‌ణ‌ల దిశ‌గా ప‌య‌నించేలా చేసింద‌ని చెబుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కూ రాష్ట్ర ప‌రిశీల‌కుడిగా ఉన్న కుంతియా.. తాజాగా స్వ‌రం పెంచ‌టం.. కీల‌క అంశాల్ని విస్ప‌ష్టంగా చెప్పేయ‌టంపై ప‌లువురు అసంతృప్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

నిజానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య నెల‌కొన్న అంత‌ర్గ‌త ర‌చ్చ‌ను సెట్ చేసేంత సామ‌ర్థ్యం కుంతియాకు లేద‌ని చెప్పాలి. ఆయ‌న మాట‌లు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ లాంటి వారికి కారం రాసిన‌ట్లుగా మారింది. నాయ‌క‌త్వ మార్పు ఉండ‌ద‌ని చెప్ప‌టానికి కుంతియా ఎవ‌రంటూ నేరుగా ప్ర‌శ్నించ‌టం ఒక ఎత్తు అయితే.. ఉత్త‌మ్‌.. కుంతియా కాంబినేష‌న్ తో టీ కాంగ్రెస్‌ కు చెడు కాలం దాపురించిద‌న్న భావ‌న‌ను ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. కుంతియా వ్యాఖ్య‌ల‌పై పార్టీ అధినాయ‌క‌త్వానికి గుట్టుచ‌ప్పుడు కాకుండా నివేదిక‌లు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే కుంతియాతో పార్టీలో క్ర‌మ‌శిక్షణ పెరుగుతుంద‌ని.. అంత‌ర్గ‌త విభేదాలు త‌గ్గి.. క‌లిసి క‌ట్టుగా ప‌ని చేసే అవ‌కాశం ఉంద‌న్న భావ‌న వ్య‌క్త‌మైన‌ప్ప‌టికీ.. అదంత సుల‌భం కాద‌న్న విష‌యం ఆయ‌న వ్యాఖ్య‌లు తేల్చేశాయంటున్నారు.

కుంతియా వ్యాఖ్య‌ల‌పై కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మేకాదు.. నాయ‌క‌త్వ మార్పు మీద మాట్లాడ‌టానికి కుంతియా ఎవ‌రంటూ ఫైర్ అవుతున్నారు. తాము ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా ప‌ట్టించుకోని పార్టీ తీరుపై కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే.. వారు బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధం కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ అదేజ‌రిగితే కాంగ్రెస్‌ కు ఇబ్బందేన‌న్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. మ‌రో వాద‌న‌ను కాంగ్రెస్ నేత‌లు వినిపిస్తున్నారు. టీ కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌కు.. అసంతృప్తికి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కేంద్రంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. అందుకే వారిని వ‌దిలించుకునే దిశ‌గా కాంగ్రెస్ పావులు క‌దుపుతోంద‌ని.. అందులో భాగంగానే కుంతియా తాజా వ్యాఖ్య‌లుగా చెబుతున్నారు. బ‌ల‌మైన ప్ర‌జాద‌ర‌ణ ఉన్న కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కు కాలిపోయే మాట‌ను కుంతియా అన్నారంటే.. అందుకు ముందుగా ఆయ‌న అధినాయ‌క‌త్వం ద‌గ్గ‌ర ప‌ర్మిష‌న్ తీసుకునే ఉంటార‌ని చెబుతున్నారు. ఏది ఏమైనా.. కుంతియా మాట‌లు రేపిన తుఫాను ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా లేవ‌ని.. ఏదో ఒకటి జ‌రిగే వ‌ర‌కూ వెళుతుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.