Begin typing your search above and press return to search.
చక్రం తిప్పుతున్న కేవీపీ..కాంగ్రెస్ లో కలవరం
By: Tupaki Desk | 11 Jun 2018 8:22 AM GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. ఆ పార్టీలో ప్రస్తుతం జరగుఉతన్న చర్చ ప్రకారం తెలుగు రాజకీయాల్లో సుపరిచితమైన ఓ ప్రముఖ వ్యక్తి చక్రం తిప్పుతున్నాడు. ఈ పరిణామంతో మైండ్ బ్లాంక్ అవడం కాంగ్రెస్ నేతల వంతు అవుతోంది. ఆ సుప్రసిద్ధమైన వ్యూహకర్త మరెవరో కాదు...ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో - ప్రభుత్వంలో అన్నీ తానై చక్రం తిప్పిన సీనియర్ నేత - ఎంపీ కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ ప్రకారం...ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా కేవీపీ మారారని అంటున్నారు. రాబోయే ఎన్నికల కార్యాచరణ కేవీపీ సారథ్యంలో జరగనుందని జోస్యం చెప్తున్నారు. అయితే, ఇది గతంలో వలే చేదు అనుభవాలను ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ఆత్మ అన్న పేరు పడ్డ ఆయన వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పంపిణీలో కీలకపాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఎడమొహం, పెడమొహంగా ఉన్న టీపీసీసీ రాష్ట్ర నాయకత్వం - ప్రతిపక్ష నాయకుడు - ఎమ్మెల్సీల మధ్య కూడా ఆయన సర్దుబాటు చేసినట్టు తెలిసింది. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కూడా ఆనాడు కేవీపీ వ్యవహరించిన తీరే కారణమని కొంత మంది నేతలు విశ్లేషణలు చేస్తున్నారు. ఇదే విషయమై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర పార్టీని తన చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు కొంత మంది నాయకులను పావులుగా ఉపయోగించుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక యువ ఎమ్మెల్యేతో కేవీపీ అత్యంత సన్నిహితంగా మెలుగుతూ కావాల్సిన సమాచారం చేరవేస్తున్నట్టు పలువురు విమర్శిస్తున్నారు.`