Begin typing your search above and press return to search.

ఇప్పుడొచ్చిన ప‌ట్టును ఎట్టి ప‌రిస్థితుల్లో విడ‌వొద్దు!

By:  Tupaki Desk   |   1 May 2019 5:21 AM GMT
ఇప్పుడొచ్చిన ప‌ట్టును ఎట్టి ప‌రిస్థితుల్లో విడ‌వొద్దు!
X
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌ద‌ని ఊరికే అన‌రు. క‌లిసి వ‌చ్చిన‌ప్పుడు అన్ని త‌మ‌కు అనుకూలంగా సాగిపోవ‌టాన్ని చాలామంది అర్థం కంటే అపార్థ‌మే ఎక్కువ‌గా చేసుకుంటారు. త‌మ‌కు తాము తోపులుగా ఫీల్ అవుతూ.. ఈ కార‌ణంతోనే తామేం అనుకుంటే అదే జ‌రుగుతుంద‌న్న భ్ర‌మ‌లో ఉంటారు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వారు క‌చ్ఛితంగా త‌ప్పులో కాలేయ‌టం ఖాయం.

ఇప్పుడు అలాంటి ప‌రిస్థితినే గులాబీ బాస్.. ఆయ‌న బ్యాచ్ కు ఎదురైందా? అంటే.. అవున‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏ విష‌యంలోనూ ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త క‌ల‌ల్ని ఆవిష్క‌రించ‌ట‌మే త‌ప్పించి.. పూర్తి చేసే విష‌యం మీద శ్ర‌ద్ధ లేక‌పోవ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కున్న పెద్ద లోపంగా చెప్పాలి. అదే స‌మ‌యంలో స‌మ‌స్య ఏదైనా మీద ప‌డితే.. దాన్ని ఎదుర్కొనే క‌న్నా.. మౌనంగా ఉండ‌టం ఆయ‌న‌కు అల‌వాటు.

తాను వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అంశాల మీద స్పందించ‌ని ఆయ‌న‌.. వాటికి త‌గిన ప్రాధాన్య‌త లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. దీంతో.. చాలా అంశాలు అప్రాధాన్య‌త‌తో ప‌క్క‌కు వెళ్లిపోతుంటాయి. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లోని విప‌క్షాలు ఎవ‌రికి వారు అన్న‌ట్లుగా ఉండిపోవ‌ట‌మే కాదు.. కేసీఆర్ స‌ర్కారు మీద పోరాడేందుకు సిద్ధంగా లేని వైనం గ‌డిచిన కొద్ది కాలంగా అధికార‌ప‌క్షానికి ఎదురే లేకుండా పోయిన ప‌రిస్థితి.

కేసీఆర్ స‌ర్కారు మీద ప్ర‌జ‌ల్లో సానుకూల‌త ఉంద‌ని.. ఏదైనా విష‌యంలో తాము ఆందోళ‌న‌ల‌కు దిగితే.. ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు ఉండ‌ద‌న్న అనుమానం కూడా విప‌క్షాలు ఉత్సాహంగా ముందుకు రాక‌పోవ‌టానికి కార‌ణంగా చెబుతారు. అయితే.. తాజాగా న‌డుస్తున్న ఇంట‌ర్ బోర్డు ఫ‌లితాల వ్య‌వ‌హారం విప‌క్షాల‌కు కొత్త శ‌క్తిని ఇవ్వ‌గా.. అందుకు భిన్నంగా తెలంగాణ అధికార‌ప‌క్షానికి మింగుడుప‌డ‌ని రీతిలో మారింది.

దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది విద్యార్థుల భ‌విష్య‌త్తును ప్ర‌భావితం చేసే ఇంట‌ర్ బోర్డు ఫ‌లితాల విష‌యంలో త‌ప్పులు జ‌రిగిన విష‌యాన్ని త్రిస‌భ్య క‌మిటీ కూడా తేల్చింది.ఈ వ్య‌వ‌హారం ముద‌ర‌క ముందే.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికి కేసీఆర్ యాక్టివ్ గా రియాక్ట్ కాక‌పోవ‌టం పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌ని చెబుతున్నారు.

ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌లో గంద‌ర‌గోళం ఏర్ప‌డిన వెంట‌నే.. సీఎం తెర మీద‌కు వ‌చ్చి.. విద్యార్థులు.. వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందొద్ద‌న్న భ‌రోసాను ఇవ్వ‌టంతో పాటు.. మార్కుల రీవాల్యూవేష‌న్ విష‌యాన్ని ప్ర‌భుత్వ‌మే చేప‌డుతుంద‌ని.. ఇప్పుడు ప్ర‌క‌టించిన రీతిలో.. మ‌ళ్లీ రీవాల్యూవేష‌న్ చేసి.. మార్కులు ప్ర‌క‌టిస్తామ‌ని చెబితే స‌రిపోయేది. అందుకు భిన్నంగా.. మూడు నాలుగు రోజులు గ‌మ్మున ఉండ‌టం.. విద్యార్థులు.. వారి త‌ల్లిదండ్రులే స్వ‌చ్చందంగా ఇంట‌ర్ బోర్డు వ‌ద్ద‌కు చేరుకొని ఆందోళ‌న చేప‌ట్ట‌టం విప‌క్షాల‌కు బ‌లాన్ని ఇచ్చేలా చేసింది.

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని తాము టేక‌ప్ చేస్తే ప్ర‌జాద‌ర‌ణ‌తో పాటు.. అధికార‌ప‌క్షం మీద ఒత్తిడి పెరుగుతుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన విప‌క్షాలు ఆందోళ‌న‌లు చేప‌ట్టాయి. తెలంగాణ‌లో విప‌క్షాలు నిర్వీర్యం అయ్యాయ‌న్న మాట ఉత్త‌దే అన్న విష‌యం గులాబీ ద‌ళానికి తెలిసి వ‌చ్చేలా ఇంట‌ర్ బోర్డు ఎపిసోడ్ స్ప‌ష్టం చేసింద‌ని చెప్పాలి.

అధికార‌ప‌క్షం ఇరుకున ప‌డింద‌న్న విష‌యాన్ని గుర్తించిన విప‌క్షాలు మ‌రింత ఉత్సాహంతో దూసుకెళుతున్నాయి. విప‌క్షాల దూకుడు పెరుగుతున్న కొద్దీ.. అధికార‌ప‌క్షం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డుతున్న తీరు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. తెలంగాణ ఏర్ప‌డిత త‌ర్వాత కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే స‌రైన అంశం దొర‌క‌లేద‌ని భావిస్తున్న విప‌క్షాల‌కు ఇంట‌ర్ బోర్డు వ్య‌వ‌హారం ఒక పెద్ద అస్త్రంగా మారింది. తాము నోరు విప్పితే ల‌క్ష‌లాది మంది సామాన్యుల ఆగ్ర‌హాన్ని చూడాల్సి వ‌స్తుంద‌న్న భ‌యంతో గులాబీ బ్యాచ్ ఉండిపోతే.. దొర‌క్క దొరక్క దొరికిన ప‌ట్టును ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విడవ‌కూడ‌ద‌న్న ఉద్దేశంలో విప‌క్షాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. చూస్తుంటే.. కేసీఆర్ కు రానున్న రోజులు మ‌రింత గ‌డ్డుగా మార‌టం ఖాయ‌మా?