Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్‌ పై తిరుగుబాటు...ఢిల్లీలో క్యాంప్‌

By:  Tupaki Desk   |   19 Jun 2018 6:22 AM GMT
ఉత్త‌మ్‌ పై  తిరుగుబాటు...ఢిల్లీలో క్యాంప్‌
X
అంతర్గ‌త స్వేచ్ఛ పేరుతో గ్రూపు రాజ‌కీయాల‌కు పెట్టింది పేర‌యిన కాంగ్రెస్ పార్టీలో మ‌రో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగుర‌వేసేందుకు ప‌లువురు సీనియ‌ర్లు సిద్ధం అయ్యార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏకంగా ఢిల్లీ వేదిక‌గా ఫిర్యాదులు చేయ‌నున్నార‌ని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవుల కుమ్ములాటలు రోజురోజుకు పెరుగుతుండ‌టంతో పీసీసీ అధ్యక్షుడిపై కంప్లైంట్‌ చేసేందుకు పార్టీ ముఖ్యనేతలు ఢిల్లీ బాటపడుతున్నారని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల సమాచారం. కాంగ్రెస్‌ లో కొత్త‌ కమిటీలకు ఉత్తమ్ సూచించిన పేర్ల విషయంలో తీవ్రంగా విభేదిస్తున్న పలువురు నేతలు ఆయన గురించి తేల్చుకునేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది.

పీసీసీ కమిటీలో పదవుల భర్తీపై అధిష్ఠానం కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ - ప్రచార కమిటీ - మ్యానిఫెస్టో కమిటీ - జిల్లా కమిటీలను ప్రకటించాల్సి ఉంది. గ్రూపు రాజకీయాల కారణంగా కొన్ని రోజులుగా దీనిపై కసరత్తు చేస్తున్నప్పటికీ జాబితా కొలిక్కి రాలేదు. పదవుల పంపకాల్లో నాయకుల మధ్య విభేదాలున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సలహాలు - సూచనలతో ఎంపికలు జరుగుతున్నాయి. తనను వ్యతిరేకించేవారికి పదవులు రాకుండా ఉత్తమ్ అడ్డుకుంటున్నారని ఆయన ప్రత్యర్థివర్గం ఆరోపిస్తోంది. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే త‌మ ఆందోళ‌న‌ను ప్రాథ‌మికంగా ఢిల్లీ పెద్ద‌ల‌కు చేర‌వేసిన‌ట్లు తెలుస్తోంది. మూడు రోజులపాటు ఢిల్లీలో గడిపిన ఉత్తమ్ తుది జాబితాను పార్టీ అధినేత రాహుల్ గాంధీ వ‌ద్ద ఆమోద ముద్ర వేయించుకోలేక‌పోవ‌డానికి కార‌ణం ఇదేన‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఉత్త‌మ్ కార్య‌క‌లాపాల‌ను పార్టీ పెద్ద‌ల‌కు చేర‌వేయాల‌ని కాంగ్రెస్ నేత‌లు నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.

కాంగ్రెస్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మాజీ మంత్రి డీకే అరుణ - పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌లో ఇటీవ‌లే చేరిన‌ రేవంత్‌ రెడ్డి - మాజీ మంత్రి శ్రీధర్‌ బాబు తోపాటు పలువురు ఎమ్మెల్యేలు - ఇతర ముఖ్య నాయకులు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కు వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నాయ‌కులంతా ఢిల్లీ వెళ్తుండ‌టం దీనికి బ‌లం చేకూరుస్తోంది. ఒకటి రెండు రోజులు అక్కడే ఉండి పార్టీ ముఖ్యనేతలతో పాటుగా రాహుల్‌గాంధీని వారు కలిసే అవకాశముంద‌ని స‌మాచారం. వీరిలో కొంద‌రు నేత‌లు ఉత్తమ్‌ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని విన్నవించడానికి సిద్ధమవుతున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.