Begin typing your search above and press return to search.

ప్లీజ్... ఇంటికి రెండు కావాలి

By:  Tupaki Desk   |   2 Oct 2018 8:29 AM GMT
ప్లీజ్... ఇంటికి రెండు కావాలి
X
ఇదేమిటి...తాయిలాలు పంచుతున్నారా అనుకుంటున్నారా. కాదు... కాదు... ఇది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల కోరిక. తెలంగాణ లో త్వరలో జరుగనున్న ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సీనియర్ నాయకులు కుమారులు - కుమార్తెలు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో ఒక్కో కుటుంబానికి రెండు టిక్కట్లు కావాలంటూ సీనియర్ నాయకులు కాంగ్రెస్ అధిష్టానంపై వొత్తిడి తీసుకువస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒక ఇంటికి ఒక టిక్కట్ మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ విధాన నిర్ణయం తీసుకుంది.దీంతో ఈ ఎన్నికల్లో మీకు కాని - మీ వారసులకు కాని టిక్కట్ ఇస్తాం. మిగిలిన వారికి ఇవ్వం అని తేల్చి చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - ఆయన భార్య కూడా ఈ ముందస్తు ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఇది పార్టీలో కొందరు సీనియర్లకు మింగుడు పడడం లేదు. మాకు ఒకే టిక్కట్ అని - ఆయనకు మాత్రం రెండు టిక్కట్లు ఇవ్వడమేమిటంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఈ సారి రెండు స్ధానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. వీరిద్దరిది కూడా పార్టీకి తలనొప్పులు కలిగించే అంశమే.

ఈ సారి కాంగ్రెస్ పార్టీ సరికొత్త అంకానికి తెర తీస్తోంది. అదే ఒకేసారి లోక్‌ సభకు - శాసనసభకు అభ్యర్ధులను ప్రకటించడం. ఈ నూతన పద్దతిని కూడా సీనియర్ నాయకులు తమకు అనుకూలంగా వాడుకోవాలనుకుంటున్నారు. అదెలాగంటే లోక్‌ సభకు తాము - శాసనసభకు తమ వారసుడ్ని రంగంలో దింపాలన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. ఇలా టిక్కట్లు ఆశిస్తున్న వారిలో పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి పేరు ముందుగా వినిపిస్తోంది. ఆయన తన కుమారుడు రఘువీర్ రెడ్డికి శాసనసభ టిక్కట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి విన్నవించుకున్నట్లు చెబుతున్నారు.ఆయన తర్వాత ఇక ఇదే జిల్లాకు చెందిన మరో నాయకుడు దామోదర్ రెడ్డి కూడా తన కుమారుడు నరోత్తమ రెడ్డికి టిక్కట్ కావాలని అడుగుతున్నారు. ఇక మాజీ మంత్రి డి.కె.అరుణ అయితే తన కుమార్తె స్నిగ్దారెడ్డికి మక్తల్ టిక్కట్ ఇవ్వాలంటూ అధిష్టానాన్ని కోరుతున్నారు. వీరితో పాటు పార్టీలో చేరిన కొండా సురేఖ దంపతులు కూడా వారిద్దరితో పాటు తమ వారసులకు టిక్కట్ అడుగుతున్నారు. ఇప్పటికే వారసత్వ పార్టీగా పేరు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ పేరును మరింత పెంచుకుంటుందో.... లేదూ కొత్త సంప్రదాయాలకు తెర తీస్తుందో వేచి చూడాలి.