Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ లోకి కాంగ్రెస్ విలీనమా.. కామెడీ అవుతుందా?

By:  Tupaki Desk   |   21 April 2019 3:19 PM GMT
టీఆర్ ఎస్ లోకి కాంగ్రెస్ విలీనమా.. కామెడీ అవుతుందా?
X
కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఎంత ఆ పార్టీ తెలంగాణలో ఓడిపోయినా, జాతీయ స్థాయిలో గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా సంపాదించుకోలేకపోయినా కాంగ్రెస్ జాతీయ పార్టీ. కేంద్ర ఎన్నికల సంఘం - భారత పార్లమెంట్ లెక్కలో కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ.

అలాంటి జాతీయ పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్రంలోని లెజిస్ట్లేటివ్ విభాగాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిలోకి విలీనం చేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ కు ఒక లేఖను ఇవ్వనున్నారట. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరిన ఎమ్మెల్యేలు అంతా కలిసి ఈ మేరకు ఒక లేఖను ప్రిపేర్ చేస్తున్నారట. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో పదమూడు మంది ఫిరాయించినట్టుగా - తామంతా టీఆర్ ఎస్ లోకి చేరినట్టుగా… కాబట్టి ఇంతటితో తెలంగాణ సీఎల్పీని టీఆర్ ఎస్ ఎల్పీలోకి విలీనం చేయాలని వీరంతా కోరనున్నారట!

ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు వీరు విన్నవించనున్నారట. అయితే లెక్క ప్రకారం వీరి చేరికలే చెల్లవు! ఎందుకంటే..ఫిరాయింపులు రాజ్యాంగ వ్యతిరేకం. చట్టసభలకు ప్రజల ద్వారా ఎన్నికైన వారు ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటు పడక తప్పదు. అలాంటి వారు విలీనం అంటూ ఇచ్చే లేఖలకు విలువే ఉండకూడదు!

టూ బై త్రీ కాదు కదా - అందరూ ఏకమైనా తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరినా.. వారు చేసే విలీనానికి విలువ ఉండదు! మరి ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిలోకి కాంగ్రెస్ విలీనం అయిపోయిదంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేస్తుందా? తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు ఏ మేరకు హడావుడి చేస్తారా? అనేవి ఆసక్తిదాయకమైన అంశాలు.

ఇది వరకూ తెలుగుదేశం - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీల లెజిస్ట్లేటివ్ విభాగాలు తమ పార్టీలోకి విలీనం అయిపోయినట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించుకుంది. అదంతా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, కేసీఆరర్ గత టర్మ్ లో చేసిన వ్యవహారం. మరి ఈ దఫాలో ఏకంగా కాంగ్రెస్ కే ఎసరు పెట్టేస్తున్నట్టున్నారు!