Begin typing your search above and press return to search.

సీనియ‌ర్ల‌ను కాంగ్రెస్ తీవ్రంగా అవ‌మానిస్తోందా?

By:  Tupaki Desk   |   17 Nov 2018 2:30 PM GMT
సీనియ‌ర్ల‌ను కాంగ్రెస్ తీవ్రంగా అవ‌మానిస్తోందా?
X
పొన్నాల ల‌క్ష్మ‌య్య..పీసీసీ మాజీ అధ్య‌క్షుడు - కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌. 2014 ఎన్నిక‌ల్లో తెలంగాణ వ్యాప్తంగా పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల‌కు ఆయ‌న చేతుల మీదుగా బీఫాంలు అందించారు. క‌ట్ చేస్తే...ఓ నాలుగేళ్లు గ‌డిచిన త‌ర్వాత ఆయ‌న బీఫాం కోసం ఎదురుచూడాల్సిన సంక‌ట స్థితి! ఎంద‌రో అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఈ బీసీ నాయ‌కుడు..ఢిల్లీలో ఆందోళ‌న‌గా స‌మ‌యం గ‌డుపుతూ...మొద‌టి జాబితాలో త‌న పేరు ఉంటుందా...ఉండ‌దా అనే టెన్ష‌న్...రెండో జాబితాలో వ‌స్తుందా...ఆఖ‌రికి మూడో జాబితాలో అయినా మోక్షం దొర‌క్క‌పోతుందా అంటూ ఉత్కంఠ‌తో - ఆందోళ‌నతో గ‌డిపిన దుస్థితి!!. ఆఖ‌రికి త‌న శ‌క్తియుక్తుల‌న్నీ రంగ‌రించి...మూడో జాబితాలో చోటు సంపాదించుకొని..హ‌మ్మ‌య్య అంటూ ఢిల్లీ నుంచి రాష్ర్టానికి విచ్చేయాల్సిన ప‌రిస్థితి!!!

మర్రి శశిధర్ రెడ్డి...కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ - ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో టీపీసీసీ ఎన్నికల కమిషన్ సమన్వయ కమిటీ చైర్మన్. నాలుగేళ్ల కింద‌టి వ‌ర‌కు ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి చైర్మ‌న్‌ గా ఉన్న జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ మండ‌లికి ఉపాధ్య‌క్షుడు. సుప్ర‌సిద్ధ తెలంగాణ నేత మ‌ర్రి చెన్నారెడ్డి కుమారుడు. అలాంటి నాయ‌కుడైన మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపింది. ప్రజాకూటమితో పొత్తులో భాగంగా సీటుకు ఎస‌రుపెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హించిన సనత్ నగర్ సీటును పొత్తుల్లో భాగంగా కూటమిలోని టీడీపీ అభ్యర్ధి కూన వెంకటేష్ గౌడ్‌ కు కేటాయించింది. చెన్నారెడ్డి వారసుడికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొండి చేయి చూపిన తీరు సంచ‌ల‌నంగా మారింది. కాంగ్రెస్ గత ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేసిన శశిధర్ రెడ్డి సీటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటికే సనత్ నియోజకవర్గంలో మర్రి శశిధర్ రెడ్డి ప్రచారం మొదలెట్టి ముందుకు సాగిపోతున్న స‌మ‌యంలో...ఈ నిర్ణ‌యం సంచ‌లనంగా మారింది.

మిగ‌తా నేత‌ల సంగ‌తి అటు ఉంచితే - కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు అయిన ఈ ఇద్ద‌రు నాయ‌కుల విష‌యంలో కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రించిన తీరు సంచ‌ల‌నంగా మారింది. పొత్తుతో పార్టీకి మేలు చేయాల్సింది పోయి...కాంగ్రెస్ సీనియర్ల సీటుకు ఎసరుపెట్టిందని ప‌లువురు వాపోతున్నారు. పార్టీ అగ్రనేతలు అయిన‌ పొన్నాల లక్ష్మయ్య - మ‌ర్రిశ‌శిధ‌ర్ రెడ్డి సీట్ల వ్యహహారంలో ఢిల్లీ పెద్ద‌లు వ్య‌వ‌హ‌రించిన తీరు అవ‌మాన‌క‌రంగా ఉంద‌నేది అనేక‌మంది మాట‌. పార్టీ కోసం శ్ర‌మించిన వారికి కాంగ్రెస్ ఇచ్చే గౌర‌వం ఇదేనా అనేది అనేక మంది వ్య‌క్తం చేస్తున్న ఆందోళ‌న‌. ఢిల్లీ స్థాయిలో భారీ ఎత్తున లాబీయింగ్ చేసుకున్న నిన్న మొన్న చేరిన నేత‌ల‌కు వ‌చ్చిన టికెట్లు...మూడో లిస్టులో కూడా ముఖ్య నేత‌ల‌కు ద‌క్క‌క‌పోవ‌డ‌మే కాంగ్రెస్ మార్క్ రాజకీయ‌మ‌ని పలువురి విమ‌ర్శ‌.