Begin typing your search above and press return to search.

ప్లాన్ అదిరింది కానీ.. అమలు అవుతుందా?

By:  Tupaki Desk   |   3 Nov 2015 5:00 AM GMT
ప్లాన్ అదిరింది కానీ.. అమలు అవుతుందా?
X
వరంగల్ ఉప ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో అయినా విజయం సాధించాలన్న పట్టుదలను తెలంగాణ కాంగ్రెస్ ప్రదర్శిస్తోంది. ఆత్మవిశ్వాసంతో పని చేయాలని.. గెలుపు మీద సానుకూలతతో పని చేస్తే విజయం తమదేనన్న ధైర్యాన్ని కాంగ్రెస్ నేతలుక్యాడర్ కు నూరిపోస్తున్నారు. తమ విజయంతో తెలంగాణ అధికారపక్షానికి షాక్ ఇవ్వాలని ఉద్బోదిస్తున్నారు.

పార్టీకి ఉన్న ఓట్లు చీలకుండా చేస్తే తమ విజయం పక్కా అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. విభేదాలు మరిచి.. సమిష్టిగా విజయం కోసం పని చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కార్యఅధ్యక్షుడు భట్టి విక్రమార్క తదితరుల నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపారు.

ఉప ఎన్నికల్లో పార్టీ విజయం పక్కా అని చెబుతూ.. ఉప ఎన్నికల ప్రచారాన్ని ఎలా నిర్వహించాలన్న అంశం మొదలు.. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ ఏం చేస్తే బాగుంటుందన్న అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. వరంగల్ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఓటర్లకు సంబంధించి ప్రతి 120 మంది ఓటర్లకు ఒక నేతకు బాధ్యత అప్పగించటం ద్వారా.. పార్టీ విజయం సాధించటం పక్కా అన్న మాటను చెబుతున్నారు.

మాట్లలో వినిపించిన ప్లాన్ బాగున్నప్పటికీ.. అమలు సాధ్యమేనా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. ప్రతి 120 ఓట్లకు ఒకరు చొప్పున మొత్తం పార్లమెంటు స్థానం పరిధిలోని ఓటర్లకు అవసరమైన నేతలు ఉన్నారా? అన్నది పెద్ద ప్రశ్న. ప్లాన్ పరంగా చూసినప్పుడు అద్భుతంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ ఆచరణ సాధ్యమా అన్నదే పెద్ద సందేహంగా మారింది. చేతిలో అధికారం ఉంటే ఇలాంటి భారీ ప్లాన్లు వర్క్ వుట్ అవుతాయి కానీ.. విపక్షంలో ఉండి.. అందులోకి కాంగ్రెస్ లాంటి పార్టీలో సాధ్యమా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ప్లాన్ వరకూ బానే ఉన్నా.. ఆచరణకు సంబంధించి అంతే కమిట్ మెంట్ తో పని చేస్తే.. వారు అనుకున్నట్లుగా లక్ష్యాన్ని చేరుకునే వీలుంది.