Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ లో ఎన్నికల జోరు

By:  Tupaki Desk   |   21 Aug 2018 4:19 AM GMT
కాంగ్రెస్‌ లో ఎన్నికల జోరు
X
తెలంగాణ కాంగ్రెస్‌ లో ఎన్నికల జోరు పెరిగింది. అగ్రనాయకులతో పాటు క్రింది స్థాయి కార్యకర్తల వరకూ ఎన్నికల రణరంగంలో దూకేందుకు ఆయుధాలు సిద్దం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి జరిపిన ఫేస్‌ బుక్ లైవ్‌ లో డిసెంబర్ - జనవరి నెలలలో ఎన్నికలు ఉంటాయని చెప్పారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల పనులలో తలమునకలవుతున్నారు. మేనిఫెస్టో తయారి ఒకవైపు - అధికార తెలంగాణ రాష్ట్ర సమితీ తప్పులను ఎండగట్టడం వంటి కార్యక్రమాలపై ద్రుష్టి సారిస్తున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి హామీల జడివాన కురిపిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కష్టాలే ఉండవని చెబుతున్నారు. పనిలో పనిగా ఎన్నికల హామీలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే బస్సు యాత్రలతో తెలంగాణలోని వివిధ జిల్లాలో పర్యటించిన ఉత్తమ్‌ కుమార్ ఆ యాత్రలను మరింత పెంచాలని నిర్ణయించారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంథీని వీలున్నంత ఎక్కువ సార్లు రాష్ట్రానికి రప్పించాలని - బహిరంగా సభలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆకాశాన్ని నేలకు దించుతామని - భువిలోనే స్వర్గాన్ని చూపిస్తామని అంటున్నారు. ఇంతవరకూ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వ్రుద్దాప్య పింఛన్లు మరింత పెంచుతామంటున్నారు. భార్యభర్తలిద్దరికీ పింఛన్లు ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగుల తల్లితండ్రులకూ దీనిని వర్తింప చేస్తామని హామీలు ఇస్తున్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటుందని ప్రజలకు నమ్మబలకుతున్నారు. 5000 కోట్లతో రైతులకు అవసరమైన అన్నీ కార్యక్రమాలను చేపడతామని ప్రకటిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితాలను గతంలో విడుదల చేసినట్లుగా కాకుండా కొత్త తరహాలో విడుదల చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ కొత్త ఆలోచన. ఇందుకోసం ఓ యాప్‌ ను కూడా రూపొందించనున్నారు. శక్తియాన్ పేరుతో రూపొందుతున్న ఈ యాప్ ద్వారా కార్యకర్తల నుంచి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తారు. ఎక్కువ మంది కార్యకర్తలు ఎవరికి ఓటు వేస్తారో...అంటే ఎవరైతే తమకు మంచి అభ్యర్ధి అని చెబుతారో వారికి టిక్కెట్ కేటాయించాలని నిర్ణయించారు. దీని వల్ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి కార్యకర్తల నుంచే వస్తారని - కవర్‌ లో పంపే సంప్రదాయానికి తెర దించాలన్నది అధిష్టానం ఆలోచన. ఇలా సర్వశక్తులు వొడ్డి ఎలాగైనా తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.