Begin typing your search above and press return to search.

రేవంత్ తో స‌హా హేమాహేమీలు వెనుక‌బ‌డ్డారే!

By:  Tupaki Desk   |   11 Dec 2018 4:30 AM GMT
రేవంత్ తో స‌హా  హేమాహేమీలు వెనుక‌బ‌డ్డారే!
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో సంచ‌ల‌నాలు చోటు చేసుకుంటున్నాయి. గ‌డిచిన మూడు నెలలుగా మీడియాలోనూ.. సోష‌ల్ మీడియాలోనూ క‌నిపించిన అస్ప‌ష్ట‌త ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో లేద‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసింది. కారు వ‌ర్సెస్ కూట‌మి మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రిగిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగినా.. అలాంటిదేమీ లేద‌న్న విష‌యాన్ని ఓట‌రు త‌న ఓటుతో స్ప‌ష్టం చేశారు.

కూట‌మికి స్ప‌ష్ట‌మైన అధిక్య‌త‌ను క‌ట్ట‌బెట్ట‌ట‌మే కాదు.. చాలా మీడియా సంస్థ‌లు.. త‌ల పండిన రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం లెక్కించ‌ని రీతిలో 85 సీట్ల‌కు పైచిలుకు గులాబీ కారు దూసుకెళుతోంది. కాంగ్రెస్ 13 స్థానాల్లో.. ఒక స్థానంలో టీడీపీ.. బీజేపీ ఐదు స్థానాల్లో.. మ‌జ్లిస్ నాలుగు స్థానాల్లో.. ఇత‌రులు రెండు స్థానాల్లో అధిక్య‌త‌లో ఉన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టేందుకు..మంత్రి ప‌ద‌వి కోసం పోటీ ప‌డే ప‌లువురు నేత‌లంతా ఓట‌మి బాట‌లో ప‌య‌నిస్తూ ఉండ‌టం విశేషం. తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద త‌ల‌కాయి లాంటి జానారెడ్డి మాత్ర‌మే కాదు.. తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా చెప్పే రేవంత్ రెడ్డితో స‌హా పొన్నం ప్ర‌భాక‌ర్‌.. దామోద‌ర రాజ‌న‌ర్సింహా.. పొన్నాల‌.. జీవ‌న్‌ రెడ్డి.. చిన్నారెడ్డి.. గీతారెడ్డి.. శ్రీ‌ధ‌ర్ బాబు.. సంప‌త్ కుమార్‌.. ఇలా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా కాంగ్రెస్ హేమాహేమీల‌న్న పేరున్న వారంతా ఫ‌లితాల్లో వెనుకంజ‌లో ఉన్నారు.

దీనికి త‌గ్గ‌ట్లే సీట్ల ప‌ట్టిక‌లో ఉద‌యం 10.15 గంట‌ల వేళ‌కు టీఆర్ఎస్ 90 స్థానాల్లో కాంగ్రెస్ 15 స్థానాల్లో బీజేపీ 4 స్థానాల‌తో.. మ‌జ్లిస్ 5 స్థానాల‌తో ఇత‌రులు మూడు స్థానాల్లో ఉన్నారు. సో.. మొత్తంగా చూస్తే.. టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం దిశ‌గా గులాబీ కారు దూసుకెళుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.