Begin typing your search above and press return to search.

ఓడిన కాంగ్రెస్ సీనియ‌ర్లంతా ఎంపీ సీట్ల వేట‌లో!

By:  Tupaki Desk   |   9 Jan 2019 6:26 AM GMT
ఓడిన కాంగ్రెస్ సీనియ‌ర్లంతా ఎంపీ సీట్ల వేట‌లో!
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన ప‌రాజ‌యం అంత తేలిగ్గా మ‌ర్చిపోయేదేం కాదు. ఆ పార్టీ శ్రేణులు ఇప్ప‌టికీ ప‌రాజ‌య భారం నుంచి తేరుకోలేదు. పూర్తిగా నిరాశ‌-నిస్పృహ‌ల్లో కూరుకుపోయి ఉన్నాయి. మ‌రోవైపు లోక్ స‌భ ఎన్నిక‌లు త‌రుముకొస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పార్టీకి తిరిగి జ‌వ‌స‌త్వాలు తీసుకొచ్చేదెలాగో తెలియ‌క అధిష్ఠానం కూడా త‌ల ప‌ట్టుకుంటోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా తెలంగాణ‌లో ఓ విష‌యం కాంగ్రెస్ కు మ‌రింత త‌ల‌నొప్పిగా మారుతోంది. అధిష్ఠానాన్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. అదేంటంటే.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన సీనియ‌ర్లే తిరిగి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సీట్లు కోరుతుండ‌టం. ఇటీవ‌లే ప్ర‌జ‌లు తిర‌స్క‌రించ‌గా మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామంటూ వారు ప‌ట్టుబ‌డుతుండ‌టాన్ని అధిష్ఠానం త‌ప్పుప‌డుతోంది. అదే స‌మ‌యంలో వారికి సీట్లు ఇవ్వ‌క‌పోతే పార్టీ మారుతారేమోన‌ని ఆందోళ‌న చెందుతోంది.

త‌మ‌కు ఎంపీ సీట్లు ఇవ్వాల‌ని కోరుతూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు జానారెడ్డి - కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి - జైపాల్ రెడ్డి - డి.కె.అరుణ‌ - ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి - మ‌ల్లు ర‌వి - పొన్నాల ల‌క్ష్మ‌య్య త‌దిత‌రులు అధిష్ఠానాన్ని సంప్ర‌దిస్తున్నారు. లాబీయింగ్ చేస్తున్నారు. వీరిలో జైపాల్ రెడ్డి మిన‌హా మిగిలిన అంద‌రూ ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైన‌వారే.

ఒక్క అసెంబ్లీ స్థానంలోనే విజ‌యం సాధించ‌లేక‌పోయిన ఈ నేత‌లు 3-4 అసెంబ్లీ స్థానాల‌ను క‌లుపుకొని ఉండే లోక్ స‌భ సీటును ఎలా గెల్చుకుంటార‌న్న‌ది ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం మ‌దిని తొలిచేస్తున్న ప్ర‌శ్న‌. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీ తిరిగి పుంజుకోవాలంటే పాత వారిని త‌ప్పించి కొత్త‌వారికి సీట్లు ఇవ్వాల‌ని అధిష్ఠానం భావిస్తోంది. సీనియ‌ర్లు మాత్రం ఇందుకు స‌సేమిరా అంటున్నారు. త‌మ‌కే టికెట్లు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తామంటున్నారు. వారి వ్య‌వ‌హార శైలి "ఉట్టికి ఎగ‌ర‌లేన‌మ్మ స్వ‌ర్గానికి ఎగురునా" అన్న సామెత‌ను గుర్తుచేస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

సీనియ‌ర్లను తోసిరాజ‌ని కొత్త ముఖాల‌కు టికెట్లు ఇస్తామంటే.. సీనియ‌ర్ల పార్టీని వీడుతారేమోన‌నే ఆందోళ‌న కాంగ్రెస్ ను వెంటాడుతోంది. ముఖ్యంగా జానారెడ్డి వంటి నేత‌లు త‌న కుమారుణ్ని రాజ‌కీయాల్లో క్రియాశీలం చేయాల‌నుకుంటున్నారు. అందుకు టీఆర్ ఎస్ మంచి వేదిక‌గా క‌నిపిస్తోంది. కాబ‌ట్టి కాంగ్రెస్ టికెట్ ఇవ్వ‌క‌పోతే ఆయ‌న కారెక్క‌డం ఖాయ‌మ‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స‌బితా ఇంద్రారెడ్డి, సురేశ్ షెట్క‌ర్ వంటి నేత‌లు త‌మ కుమారుల‌కు టికెట్లు కోరుతున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి త‌న భార్య‌కు ఎంపీ సీటు అర్థిస్తున్నారు. వారికి టికెట్లు నిరాక‌రిస్తే ఫిరాయింపులు త‌ప్ప‌వ‌ని కాంగ్రెస్ క‌ల‌వ‌ర‌ప‌డుతోంది.