Begin typing your search above and press return to search.

అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు!

By:  Tupaki Desk   |   21 Aug 2018 1:30 AM GMT
అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు!
X
డిసెంబర్ నెలలో తెలంగాణలో ఎన్నికలు రావడం దాదాపు ఖరారైంది. ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్తామంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ కూడా డిసెంబర్ నెలలోనే ఎన్నికలు జరుతాయని చెబుతోంది. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు - క్షేత్ర స్ధాయి కార్యకర్తలకు కూడా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేస్‌ బుక్ లైవ్‌ లో చెప్పారు. వచ్చే నెలలోనే అభ్యర్ధుల ఎంపిక జరగాలని - అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇదే విషయమై పార్టీ శ్రేణులతో మాట్లాడినట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి అభ్యర్ధుల ఎంపిక పూర్తి అయితే అక్టోబర్ - నవంబర్ నెలల్లో భారీ ప్రచారం చేయవచ్చునని - అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేస్తే ప్రజల్లో స్పష్టత వస్తుందనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. నియోజకవర్గానికి ముగ్గురు - నలుగురు అభ్యర్ధులను ఎంపిక చేసి వారి పేర్లతో అక్కడ సర్వే వంటిది చేపట్టాలని కాంగ్రెస్ భావన. ఆ నలుగురైదురు పట్ల ప్రజలలో ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుని గెలుపు గుర్రాలకే టిక్కట్లు ఇవ్వాలన్నది అధిష్టానం ఆలోచగా కనిపిస్తోంది.

ఇక అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కూడా సిట్టింగులలో కొందరిని మార్చాలనుకుంటోంది. ఇందుకోసం ముందుగా ఏ ఏ నియోజకవర్గాల్లో కొత్త వారిని నిలబెట్టాలో నిర్ణయించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు భావిస్తున్నారు. సిట్టింగులను మారిస్తే ఎలాంటి తలనొప్పులు ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అభ్యర్ధులను ఎంపిక చేయడం వల్ల ప్రజల్లో కూడా స్పష్టత వస్తుందని - దీంతో విజయం సాధించడం సులువవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. సిట్టింగులను మార్చే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని - ముందుగా వారిని ఎందుకు మారుస్తున్నామో ప్రజలకు వివరించాలని, అదే సమయంలో వారు పార్టీ మారకుండా... స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ముందుగా ఎవరినైతే మార్చాలనుకుంటున్నారో వారితో కె.చంద్రశేఖర రావు ముఖాముఖి మాట్లాడతారని, వారికి అన్యాయం జరగదంటూ భరోసా ఇవ్వాలన్నది కెసీఆర్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. మొత్తానికి అధికార - ప్రతిపక్షాలు ముందుగానే అభ్యర్ధులను ఎంపిక చేసి ఎన్నికల సమరానికి పై అనాలనుకుంటున్నారు.