Begin typing your search above and press return to search.

మారని కాంగ్రెస్ సీనియర్లు.. తీరని రేవంత్ తిప్పలు

By:  Tupaki Desk   |   14 Aug 2021 1:30 PM GMT
మారని కాంగ్రెస్ సీనియర్లు.. తీరని రేవంత్ తిప్పలు
X
ఎంత కలుపుకుపోదామనుకున్నా కలిసి రాని కాంగ్రెస్ సీనియర్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ కు తలనొప్పిగా మారారని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారం ముఖ్యం తప్పించి.. అంతర్గత కుమ్ములాటలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని ఎంతగా చెబుతున్నా.. తీరు మారని నేతల తీరు రేవంత్ కు ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఇంద్రవెల్లిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన దళిత.. గిరిజన దండోరా కార్యక్రమం అనుకున్నట్లే సక్సెస్ కావటం తెలిసిందే.

లక్షకు ఒక్కరు తగ్గినా తల వంచుతానని చెప్పిన రేవంత్ మాటకు తగ్గట్లే.. సభకు భారీగా హాజరు ఉండటం గులాబీ నేతల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంద్రవెల్లిలో నాటి దారుణాలకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? అన్న టీఆర్ఎస్ ప్రచారం పెద్దగా వర్కువుట్ కాలేదు. సభకు హాజరైన జనాన్ని చూసిన వారంతా ఒప్పుకునే పరిస్థితి. లక్ష కు ఒక్కరు కూడా తగ్గరని సవాలు చేసిన రేవంత్.. ఆ సభకు తమ పార్టీ సీనియర్ నేతలందరిని వేదిక మీదకు తీసుకొస్తానని సవాలు మాత్రం విసర్లేదు. ఒకవేళ.. అలాంటి సవాల్ కానీ టీఆర్ఎస్ నేతలు ఎవరైనా విసిరి ఉంటే మాత్రం రేవంత్ తెగ ఇబ్బంది పడేవారన్న మాట వినిపిస్తోంది.

ఇంద్రవెల్లి సభకు సీనియర్లు పెద్ద ఎత్తున డుమ్మా కొడతారన్న మాట వినిపించింది. అందుకు తగ్గట్లే.. వారెవరూ రాలేదు. అయినప్పటికి ఎక్కడా ఉత్సాహం మిస్ కాకుండా భారీ సక్సెస్ తో సభను విజయవంతం చేయటంతో రేవంత్ ఇమేజ్ గ్రాఫ్ కాస్త పెరిగిందనే చెప్పాలి. నిజానికి సీనియర్లు సభకు రాకపోవటం రేవంత్ కు మేలు కలిగించే పరిణామంగా చెప్పాలి. ఎందుకంటే.. పెద్ద ఎత్తున సీనియర్లు కనిపించి ఉంటే.. సభ సక్సెస్ వారి ఖాతాల్లోనూ జమ అయ్యేది. అందుకు భిన్నంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా పేరున్న టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్ హనుమంతరావు లాంటి వారు డుమ్మా కొట్టటం తెలిసిందే.

ఎంత కలుపుకుపోదామనుకున్నా.. కలిసి రాని సీనియర్లు రేవంత్ కు పరీక్షల మీద పరీక్షలు పెడుతున్నారే చెప్పాలి. అయితే.. ఇలాంటివాటిని అధిగమించగలిగితే.. రేవంత్ కు తిరుగులేదన్న మాట బలంగా వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పార్టీ గ్రాఫ్ ఎలా ఉందన్న విషయం అందరికి తెలిసిందే. అన్నింటికి మించి కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎవరేం చేశారో.. ఎలా వ్యవహరిస్తున్నారో తెలిసిందే.

అధికారంలో ఉన్నప్పుడు తమకు చెప్పిన మాటలకు.. అధికారం చేజారిన తర్వాత వారి పనితీరు విషయంలో ఢిల్లీ నాయకత్వానికి స్పష్టమైన అవగాహన ఉందంటున్నారు. రేవంత్ కు పగ్గాలు అప్పజెప్పిన తర్వాత వారి సహాయ నిరాకరణ చేస్తే ఎలా డీల్ చేయాలన్న దానిపై అవగాహన ఉందని.. ఇవన్నీ చికాకులే తప్పించి.. మరింకేమీ కాదంటున్నారు. ఎంత భరిద్దామని అనుకున్నా భరించలేనట్లుగా ఉన్న సీనియర్లు తీరు బాధిస్తున్నా.. అధిష్ఠానం అండ తనకుందన్న ధీమాతో రేవంత్ ఉన్నట్లు చెబుతున్నారు. సీనియర్ సహాయ నిరాకరణను ఎంతవరకు రేవంత్ భరిస్తారన్న దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందన్న మాట వినిపిస్తోంది.