Begin typing your search above and press return to search.

ఎన్నిక‌లు ముందుకు.. దళిత బంధు వెన‌క్కి

By:  Tupaki Desk   |   18 Sep 2021 8:36 AM GMT
ఎన్నిక‌లు ముందుకు.. దళిత బంధు వెన‌క్కి
X
తెర ముందు ఎన్ని వేషాలు వేసినా.. అన్ని రాజ‌కీయ పార్టీల ప్ర‌ధాన ల‌క్ష్యం ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే. అందుకోస‌మే సంక్షేమ ప‌థ‌కాలంటూ.. ఉచిత హామీలంటూ.. ఓటర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఇక అధికార పార్టీ అయితే అప్ప‌టిక‌ప్పుడూ ఓ ప‌థ‌కాన్ని రూపొందించి ప్ర‌జ‌ల్లోకి వ‌దిలి ఓట్లు సొమ్ము చేసుకోవాల‌ని చూస్తుంది. ఇప్పుడు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ వ్య‌వ‌హార శైలి కూడా అలాగే ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న సీఎం కేసీఆర్‌.. అక్క‌డ ఎలాగైనా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా అదే నియోజ‌క‌వ‌ర్గంలో ప్రారంభించార‌నేది బహిరంగ ర‌హ‌స్య‌మే. అర్హులైన ద‌ళిత కుటుంబాల‌కు రూ.10 ల‌క్ష‌లు అందించాల‌న్న‌ది ఈ ప‌థ‌క ల‌క్ష్యం. అందుకు అనుగుణంగానే ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసి వాళ్ల ఖాతాల్లో డ‌బ్బులు వేయ‌డం మొద‌లెట్టారు. కానీ ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఆ డ‌బ్బులు మాయం అవుతున్నాయి. దాని వెన‌క ఓ కార‌ణం ఉంది.

హుజూరాబాద్‌లో ఎన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించినా.. ప్ర‌ధాన అస్త్రంగా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌యోగించినా అక్క‌డి జ‌నాల్లో ఆద‌ర‌ణ ఉన్న ఈట‌ల రాజేంద‌ర్‌పై టీఆర్ఎస్ విజ‌యం సాధించ‌డం క‌ష్ట‌మ‌నే ఇంటిలిజెన్స్ రిపోర్ట్ కేసీఆర్ చేతుల్లోకి చేరింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో ఎన్నిక‌లు కాస్త ఆల‌స్య‌మైతే ప‌రిస్థితుల్లో ఏమ‌న్నా మార్పులు జ‌రిగి త‌మ పార్టీకి అనుకూలంగా మారే అవ‌కాశం ఉంటుంద‌నే ఉద్దేశంతో క‌రోనా కార‌ణంగా చూపించి ఉప ఎన్నిక‌కు ముందుకు జ‌రిపేలా చేశారు. పండ‌గ‌ల సీజ‌న్ త‌ర్వాతే ఈ ఉప ఎన్నిక నిర్వ‌హిస్తామ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. అంటే న‌వంబ‌ర్‌లో లేదా డిసెంబ‌ర్‌లో ఈ ఎన్నిక జ‌రిగే అవ‌కాశం ఉంది. మ‌రీ అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌జ‌ల్లో పార్టీ పేరు నానాలంటే ఏం చేయాలి? వెంట‌నే ద‌ళిత బంధు పైస‌ల‌ను ఇవ్వ‌డం ఆపేయాలి అని అధికార పార్టీ అనుకున్న‌ట్లు ఉంది. ఇప్పుడు సాయం నిలిపేసి ఎన్నిక‌ల‌కు ముందు మ‌ళ్లీ జ‌మా చేస్తే అప్పుడు ప్ర‌జ‌లు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అందుకే ల‌బ్ధిదారుల ఖాతాల్లో ప‌డ్డ సొమ్మును ప్ర‌భుత్వం వెన‌క్కి తీసుకుంటుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. డ‌బ్బుల ప‌డ్డ కొన్ని ఖాతాల‌ను స్తంభింప‌జేస్తున్న అధికారులు.. మ‌రికొన్నింటి నుంచి పైస‌ల‌ను డెబిట్ చేస్తున్నార‌నే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ముఖ్యంగా ఒంట‌రి మ‌హిళ‌లు, వృద్ధులు, నిరుపేద కూలీలు, యువ‌కుల ఖాతాల్లో నుంచి డ‌బ్బులు వాప‌స్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలోని స‌ర్వే చేసి మొత్తం 20,900 మంది ద‌ళిత కుటుంబాలు ఉన్న‌ట్లు తేల్చారు. ద‌ళిత బంధు ర‌క్ష‌ణ నిధి కోసం రూ.10 వేలు పోను.. మిగ‌తా రూ.9.90 ల‌క్ష‌ల‌ను ల‌బ్ధిదారుల పేరుతో తీసిన ప్ర‌త్యేక ఖాతాలో జ‌మ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ 14,400 మంది అకౌంట్ల‌లో డ‌బ్బులు వేసిన‌ట్లు తెలిసింది. అయితే కొన్ని రోజులుగా కొంత‌మంది ఖాతాల్లో నుంచి డ‌బ్బులు వాపస్ అయినట్లు మెసేజ్‌లు వ‌స్తున్నాయి. వృద్ధులు, ఒంట‌రి మ‌హిళ‌ల‌తో పాటు త‌క్కువ ఓట‌ర్లున్న ఇళ్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని డ‌బ్బులు క‌ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. క‌మలాపూర్ మండలంలో మొత్తం 156 మంది ఖాతాల్లో నుంచి డ‌బ్బులు డెబిట్ చేసినట్లు స‌మాచారం.

ఈ మండ‌లంలో మొత్తం 185 మంది వృద్ధ‌లు, 646 మంది ఒంట‌రి మ‌హిళ‌ల‌ను గుర్తించిన అధికారులు వారి ఖాతాల్లో నుంచి కూడా డ‌బ్బులు వాప‌స్ తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా ఖాతాల్లో ప‌డ్డ డ‌బ్బులు మాయ‌మ‌వుతుండ‌డంతో ఆందోళ‌న చెందుతోన్న ల‌బ్ధిదారులు బ్యాంకుల‌కు ప‌రుగులు పెడుతున్నారు. కానీ అక్క‌డి సిబ్బంది త‌మ‌కేమీ సంబంధం లేద‌ని చెప్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ అధికారుల ద‌గ్గ‌ర‌కు వెళ్తున్నారు. వాళ్ల ద‌గ్గ‌రి నుంచి స‌రైన స‌మాధానం రావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే వృద్ధులు, ఒంట‌రి మ‌హిళ‌ల విష‌యంలో ప్ర‌భుత్వం నుంచి మార్గ‌ద‌ర్శ‌కాలు రానందున వాళ్ల ఖాతాల్లో ప‌డ్డ డ‌బ్బుల‌ను డెబిట్ చేశామ‌ని ప్ర‌భుత్వం ఆదేశిస్తే మ‌ళ్లీ జ‌మ చేస్తామ‌ని అధికారులు చెప్తున్నారు. ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి సాయం చేస్తామ‌ని కేసీఆర్ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా జ‌రుగుతుంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం ప్ర‌జ‌ల‌తో ప్ర‌భుత్వం ఆడుకుంటున్న‌ద‌నే ఆరోప‌ణ‌లు ఎక్కువ‌వుతున్నాయి.