Begin typing your search above and press return to search.

జిగ్నేష్‌ తో తెలంగాణ ఐపీఎస్ భేటీ మ‌ర్మమేంటో?

By:  Tupaki Desk   |   18 Jan 2018 2:34 PM GMT
జిగ్నేష్‌ తో తెలంగాణ ఐపీఎస్ భేటీ మ‌ర్మమేంటో?
X
గుజరాత్ దళిత నేత‌ - స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ తెలంగాణ పర్యటన అనూహ్య మ‌లుపు తిరిగింది. మాదిగ రిజ‌ర్వేష‌న్ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగను జైలులో పరామర్శించిన జిగ్నేష్ అనంత‌రం తెలంగాణ‌ ప్ర‌భుత్వం తీరుపై మండిప‌డ్డారు. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్య హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతోందని మండిప‌డ్డారు. తెలంగాణ‌లోని ద‌ళిత శ‌క్తులంతా ఐక్యం కావాల‌ని ఆయ‌న సూచించారు. ఇలా తెలంగాణ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా స్పందించిన జిగ్నేష్‌ తో తెలంగాణ‌లో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి - ద‌ళితుల ప‌క్ష‌పాతిగా పేరున్న ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌ కుమార్ భేటీ అవ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన జిగ్నేశ్ మంద‌కృష్ణ‌తో భేటీ త‌ర్వాత వేముల రోహిత్ తల్లి రాధికతో స‌మావేశం అయ్యారు. వేముల రాధికకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని - దళితులపై దాడులను కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులకు వ్యతిరేకంగా లెఫ్ట్ - ప్రజా సంఘాలతో కలిసి ఓ వేదికను ఏర్పాటు చేస్తామన్నారుర. సుప్రీం న్యాయమూర్తులే ప్రజల ముందుకు వచ్చారంటే దేశం ఎటువైపు వెళుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా బీజేపీ ప్లాన్ గా ముందుకెళుతోందని - బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సంఘటితంగా పోరు చేస్తామన్నారు. అన‌త‌రం మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. వాటిని మరింతగా ఉదృతం చేసేందుకు త‌న వంతుగా ప్రయత్నిస్తానని తెలిపారు. అవసరమైతే సొంతంగా ఒక వేదిక ఏర్పాటు చేయాలని భావిస్తున్నాన‌ని లేదంటే ఇప్పటికే ఉద్యమిస్తున్న సంఘాలతో కలిసి పని చేస్తానని ప్ర‌క‌టించారు.

ఇలా తెలంగాణ ప్ర‌భుత్వానికి పూర్తి వ్య‌తిరేక ప్ర‌క‌ట‌న చేసిన జిగ్నేష్‌ తో ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ భేటీ అవ‌డం అనేక చ‌ర్చోప‌చ‌ర్చ‌ల‌కు దారితీసింది. ఈ భేటీలో ప్రొఫెస‌ర్ కంచ ఐల‌య్య‌ - కేసీఆర్‌ పై ఒంటికాలిపై లేచే టీ మాస్ నేత‌లు - రోహిత్ వేముల త‌ల్లి పాల్గొన‌డం ఆస‌క్తిక‌రం. రాష్ట్ర ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకిస్తున్న వారికి ఉద్య‌మ‌కారుడికి వ్య‌తిరేకంగా సీనియ‌ర్ ఐపీఎస్ భేటీ అవ‌డంపై - అందులోనూ అప్ప‌టికే మీడియాలో స్ప‌ష్టంగా తెలంగాణ స‌ర్కారు తీరును త‌ప్పుప‌ట్టిన వ్య‌క్తితో స‌మావేశం అవ‌డంపై ప‌లువురు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను తెలంగాణ బీజేపీ సైతం త‌ప్పుప‌డుతోంది.