Begin typing your search above and press return to search.

ఎంసెట్ లీక్: మూడు రాష్ట్రాల్లో తిరిగింది!

By:  Tupaki Desk   |   5 Aug 2016 7:03 AM GMT
ఎంసెట్ లీక్: మూడు రాష్ట్రాల్లో తిరిగింది!
X
సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్ పేపర్ లీకేజీ కేసులో సిఐడి అధికారులకు సైతం ఆశ్చర్యం కలిగించే విషయాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబందించి ఇక్బాల్ అనే వ్యక్తిని మొదటి ముద్దాయిగా చేర్చిన సీఐడీ రాజ్ గోపాల్ రెడ్డిని రెండో ముద్దాయిగా చేర్చింది. తాజాగా రెండో నిందితుడైన రాజగోపాల్ రెడ్డిని విచారించగా.. దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో జరిగిన ఈ ఎంసెట్ పేపర్ కు సంబందించిన లీకుల వ్యవహారం ముందుగా ఢిల్లీలో పునాది వేసుకుని బెంగళూరు హోటల్ మౌర్యలో కార్యచరణ జరిగి, పూణేకు విస్తరించి హైదరాబాద్ ను ప్రభావితం చేసింది. తాజాగా రాజ గోపాల్ రెడ్డి ద్వారా సేకరించిన సమాచారాన్ని సిఐడి నాంపల్లి కోర్టుకు సమర్పించింది.

రాజ్‌ గోపాల్ వెల్లడించిన విషయాల ప్రకారం.. కర్ణాటకలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజిమెంట్ కోటా సీట్లను వివిధ రాష్ట్రాల విద్యార్ధులకు ఇప్పించేవాడు రాజగోపాల్. ఈ క్రమంలోనే ఇతనికికి హైదరాబాద్‌ కు చెందిన విష్ణు - విజయవాడకు చెందిన జ్యోతి బాబు - ఢిల్లీకి చెందిన రాజేష్‌ లతో పరిచయం ఏర్పడింది. రాజ్‌ గోపాల్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు అక్కడే రాజేష్ ప్రధాన సూత్రధారి ఇక్బాల్‌ను పరిచయం చేశాడు. ఇక్బాల్ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజిమెంట్‌ కోటా సీట్లను ఇప్పించే కార్యక్రమాలే చేసేవాడు కావడంతో ఇక్బాల్ - రాజగోపాల్‌ రెడ్డి ల బందం మరింత బలపడింది. ఈ క్రమంలో ఒకసారి బెంగళూరు లోని హోటల్ మూర్యాలో ఇక్బాల్ - రాజ్ గోపాల్ రెడ్డి - రాజేష్ లు కలుసుకున్నప్పుడు.. తనవద్ద తెలంగాణ ఎమ్ సెట్-2 ప్రశ్నపత్రాలు రెండు సెట్లు ఉన్నాయని ఇక్బాల్ చెప్పాడు. దీంతో ఈ పేపర్ లకు రూ. 25 నుంచి రూ. 35 లక్షల మేర రేటు ఫిక్స్ చేసిన ఈ బ్యాచ్... ముందుగా డబ్బులు చెల్లించేవారు సరే, అలా చెల్లించలేని వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు వీరికి అందించి పరీక్ష పూర్తయిన తర్వాత, వారు ఆశించిన ర్యాంకు వచ్చిన అనంతరం మొత్తం సొమ్ము చెల్లించి తమ సర్టిఫికెట్లు పొందొచ్చని రాజ్‌ గోపాల్‌ రెడ్డి వారికి చెప్పాడు.

దీంతో రంగంలోకి దిగిన విష్ణు - తిరుమలరావు 14 మంది విద్యార్ధులను - 6గురు విద్యార్ధుల తల్లితండ్రులను సంప్రదించి డీల్ కుదుర్చుకున్నారు. రాజ్‌ గోపాల్ వీరికి ముందుగా మార్గనిర్దేశం చేసినట్లుగానే... జూలై 8 ఉదయం విద్యార్ధులను బెంగళూరుకు తరలించారు. అదే రోజు ఇక్బాల్ ఎంసెట్ - 2 రెండు సెట్ల ప్రశ్నపత్రాలతో ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చి తాను ఉన్న చోటికి విద్యార్ధులను, వారి తల్లితండ్రులను తీసుకురావాలని రాజ్‌ గోపాల్‌ కు చెప్పాడు. విద్యార్ధులను తీసుకుని బెంగళూరులోని ఉపహార్ హోటల్‌ కు వెళ్లారు. వారి వద్ద నుంచి సర్టిఫికెట్లు - బ్లాంక్ చెక్‌ లను తీసుకున్న ఇక్బాల్ అండ్ రాజగోపాల్ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రశ్నపత్రాలను విద్యార్ధులకు అందించారు. అనంతరం అదే రోజు రాత్రి ఆ విద్యార్థులను బెంగళూరు నుంచి హైదరాబాద్‌ కు పంపారు. కాగా జూలై 9వ తేదీ తెలంగాణ ఎంసెట్ -2 పరీక్ష హైదరాబాద్ తదితర కేంద్రాల్లో జరిగిన విషయం తెలిసిందే.

ఇదే సమయంలో పూణేలో కూడా ప్రశ్నపత్రం లీకేజ్‌ కి సంబంధించి పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ఈ కేసులో నిందితులైన రెసోనెన్స్ ఉద్యోగులు హైదరాబాదులోని బోడుప్పల్‌ కు చెందిన షేక్ రమేష్ ఎంసెట్ ప్రశ్నపత్రాలు విక్రయింపచూశారు. సెట్‌ కు రూ. 35 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రమేష్ ద్వారా వీరు హైదరాబాదులోని సోమాజిగూడలోని కన్సల్టెన్సీ ప్రతినిధి రామకృష్ణను సంప్రదించారు. అనంతరం కొంతమంది విద్యార్ధుల తల్లితండ్రులకు గాలం వేసి సొమ్ము / సర్టిఫికెట్లు వసూలు చేసి జూలై 8వ తేదీన పూణెకు తీసుకెళ్లారు. పూణేలో ఒక రహస్య ప్రదేశంలో ఈ నలుగురు విద్యార్ధులకు రెండు సెట్ల ప్రశ్నపత్రాలను అందించి అనంతరం వారిని పూణె నుంచి హైదరాబాద్‌ కు పంపారు. ఈ స్థాయిలో పథకాలు రచించి ఈ లీకేజీ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న ఇక్బాల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసుకు సంబందించి 8 మందిని అరెస్టు చేశారు.