Begin typing your search above and press return to search.

కేసీఆర్ నాలెడ్జ్ ఎంతో తేల్చ‌నున్న ఈసీ?

By:  Tupaki Desk   |   7 Sep 2018 7:38 AM GMT
కేసీఆర్ నాలెడ్జ్ ఎంతో తేల్చ‌నున్న ఈసీ?
X
ముంద‌స్తుకు వెళ్ల‌టానికి వీలుగా తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దుచేస్తూ కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన త‌ర్వాత ఆయ‌న మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడ‌టం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌నో ఆస‌క్తిక‌ర‌మైన ముచ్చ‌ట చెప్పారు. త‌న‌కున్న నాలెడ్జ్ ప్ర‌కారం ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న విష‌యాన్ని చెప్పారు.

మీడియాలో వ‌స్తున్న‌ట్లుగా సందేహాల‌కు తావు లేద‌ని.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ‌లోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఈసీ ఓకే అంటుంద‌ని.. త‌న‌కు ఆ న‌మ్మ‌కం ఉంద‌న్నారు. న‌వంబ‌రులో ఎన్నిక‌లు.. డిసెంబ‌రు మొద‌టి వారంలో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి అవుతాయంటూ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇలా ఉంటుంది తెలుసా? అన్న‌ట్లుగా కేసీఆర్ చెప్పేశారు.

సాధార‌ణంగా ఏ ముఖ్య‌మంత్రి ఇంత ఓపెన్ గా మాట్లాడ‌టం ఉండ‌దు. అంతేనా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారితో తాను మాట్లాడిన విష‌యాన్ని ఓపెన్ చెప్పేశారు. సాధార‌ణంగా ముంద‌స్తుకు వెళ్లే ప్ర‌భుత్వాధినేత కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారులతో తాను మాట్లాడిన‌ట్లు చెప్ప‌టం కొంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ముంద‌స్తుకు వెళ్లాల‌నుకున్న ఒక ప్ర‌భుత్వాధినేత‌.. ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయ‌టానికి ముందు మాట్లాడ‌టం అంటే.. దేని గురించి మాట్లాడి ఉంటార‌న్న‌ది ఊహించ‌టం పెద్ద విష‌య‌మే కాదు. అలాంట‌ప్పుడు కీల‌క ప‌ద‌విలో ఉన్న అధికారుల‌తో ప్ర‌భుత్వాధి నేత హోదాలో రాజ్యాంగ‌ప‌ర‌మైన అంశాల గురించి మాట్లాడొచ్చా? అన్న క్వ‌శ్చ‌న్ క‌లుగ‌క మాన‌దు.

మీడియా స‌మావేశంలో ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయ‌న్న విష‌యంపై కేసీఆర్ మాట్లాడిన తీరు.. ఆయ‌న మాట‌ల్లో వినిపించిన కాన్ఫిడెన్స్ చూస్తే..ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయి? షెడ్యూల్ ఎలా ఉండే అవ‌కాశం ఉంద‌న్న దానిపై ఆయ‌న‌కు కొంత అవ‌గాహ‌న ఉంద‌న్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దుకు సంబంధించిన నోటిఫికేష‌న్ గురువారం సాయంత్రానికే ఎన్నిక‌ల సంఘానికి చేరిన‌ట్లుగా ఎన్నిక‌ల సంఘం అధికారి ఒక‌రు ధ్రువీక‌రించ‌టం గ‌మ‌నార్హం. మ‌రోవైపు కేంద్ర ఎన్నిక‌ల సంఘం భేటీ కానుంది. ఈ భేటీలో నాలుగు రాష్ట్రాల్లో జ‌ర‌పాల్సిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హించాలి? ఎన్ని ద‌శ‌ల్లో నిర్వ‌హించాల‌న్న అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం ఉంది. నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటు.. తాజాగా ర‌ద్దు అయిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల మీదా కేంద్ర ఎన్నిక‌ల సంఘం చ‌ర్చించి.. ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న ఎంతో కొంత చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

తాను చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ .. మిగితా ఇద్ద‌రు క‌మిష‌న‌ర్ల‌తో మాట్లాడాన‌ని కూడా చెప్పిన నేప‌థ్యంలో.. కేసీఆర్ పూర్తిస్థాయి స్ప‌ష్ట‌త‌తోనే తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీసుకొని ఉంటార‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారి ర‌జ‌త్ కుమార్ ఒక‌ట్రెండురోజుల్లో ఢిల్లీకి వెళ్లి ఈసీతో భేటీ కానున్నారు. ఈ స‌మావేశం జ‌రిగి.. అందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న విడుద‌లైతే కేసీఆర్ నాలెడ్జ్ లెక్క ఏమిటో తెలిసే వీలుంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.