Begin typing your search above and press return to search.

ఢిల్లీకి ర‌మ్మ‌ని ర‌జ‌త్ కుమార్‌ కు పిలుపు?

By:  Tupaki Desk   |   7 Sep 2018 8:41 AM GMT
ఢిల్లీకి ర‌మ్మ‌ని ర‌జ‌త్ కుమార్‌ కు పిలుపు?
X
తెలంగాణ‌లో ముంద‌స్తు జోరు అంత‌కంత‌కూ పెరుగుతోంది. కేవ‌లం మూడంటే మూడు గంట‌ల వ్య‌వ‌ధిలో తాను అనుకున్న‌ట్లుగా అసెంబ్లీని ర‌ద్దు చేసి ముంద‌స్తుకు సై అనేశారు తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. గురువారం ఉద‌యం ముఖ్య‌మంత్రిగా కేబినెట్ స‌మావేశం నిర్వ‌హించి.. గంట‌ల వ్య‌వ‌ధిలో అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. తాను కోరుకున్న‌ట్లే గంట‌ల వ్య‌వ‌ధిలో అసెంబ్లీ ర‌ద్దు నోటిఫికేష‌న్ ను జారీ చేశారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. తాను ఎవ‌రికి చెప్ప‌కుండానే ముంద‌స్తు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా కేసీఆర్ గొప్ప‌లు చెప్పుకున్నా.. మీడియా అంతా కోడై కూయ‌టం.. తాను అసెంబ్లీ ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన మూడు గంట‌ల వ్య‌వ‌ధిలోనే గెజిట్ కూడా విడుద‌ల కావ‌టం చూస్తే.. ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే అంతా జ‌రిగింద‌ని చెప్పాలి.

మ‌ధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా స‌మాచారం బ‌య‌ట‌కు రాగా..సాయంత్రానికి ఢిల్లీ లోని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దు వివ‌రాలు అధికారికంగా అందాయి. ఈ నేప‌థ్యంలో ఈ రోజున తెలంగాణ ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారికి పిలుపు వ‌చ్చింది. అసెంబ్లీ ర‌ద్దు నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు ఢిల్లీ నుంచి పిలుపు వ‌చ్చిన‌ట్లుగా భావిస్తున్నారు.

అసెంబ్లీ ర‌ద్దు నేప‌థ్యంలో నాలుగు రాష్ట్రాల్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌లోనే తెలంగాణ‌లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఉన్న అవ‌కాశాల మీద చ‌ర్చ జ‌రిపేందుకే ర‌జ‌త్ కుమార్ ను సీఈసీ పిలుస్తున్న‌ట్లుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్ర‌వారం ఉద‌యం ర‌జ‌త్‌కుమార్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 31 జిల్లాల క‌లెక్ట‌ర్ ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు.. అవ‌స‌రాల‌తో పాటు.. శాంతిభ‌ద్ర‌త‌లు.. ఈవీఎంల ప‌నితీరుపై స‌మీక్ష నిర్వ‌హించారు.

మ‌రోవైపు జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిశోర్ నేతృత్వంలో జ‌రిగిన స‌మావేశంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్ర‌వేశ పెడుతున్న వీవీపీఏటీ విధానంపై క‌లెక్ట‌ర్ల‌కుఅవ‌గాహ‌న క‌ల్పించారు. ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి వ‌చ్చిన పిలుపు మేర‌కు ర‌జ‌త్ కుమార్ ఈ సాయంత్రం ఢిల్లీకి బ‌య‌లుదేర‌నున్నారు. తాజా పిలుపు ముంద‌స్తు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన అంశాల‌పై చ‌ర్చ కోస‌మేన‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.