Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఎన్నికల జ్వరం.. ఎవరి పయనం ఎటువైపు?

By:  Tupaki Desk   |   3 Jan 2023 5:27 AM GMT
తెలంగాణలో ఎన్నికల జ్వరం.. ఎవరి పయనం ఎటువైపు?
X
తెలంగాణలో ఎన్నికల జ్వరం పట్టుకుంది. ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. భారత్ రాష్ట్రసమితి (బీఆర్ఎస్)లో టికెట్ దక్కే అవకాశం లేనివారు.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున గెలుపొందినా.. ఆ తర్వాత అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయినవారు, హస్తం పార్టీలో విభేదాల కారణంగా బయటకు రావాలనే ఆలోచనలతో ఉన్నవారు.. వీరిలో ఎవరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? వీరి పయనం ఏ వైపు ఉంటుందన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరందుకుంది.

ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసమ్మతి నెలకొంది. ఆ జిల్లాలోని ముఖ్యనాయకులు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో చోటుచేసుకునే రాజకీయ సమీకరణాలను వేడెక్కించాయి.

అధికార పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి , తాజా అసమ్మతి నేపథ్యంలో కొండా సురేఖ దంపతులు, ఇలా అనేకమంది భవిష్యత్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున 19 మంది గెలవగా.. ఇందులో 12 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి ఇటీవల రాజీనామా చేసి బీజేపీ తరుపున పోటీచేసి ఓడిపోయారు. ఈయన సోదరుడు, సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా పార్టీతో విభేదాలు తీవ్రమయ్యాయి. విడిపోయి బీజేపీ తరుఫున పోటీచేసి ఓడిపోయారు.

కొల్హాపూర్ లో మాజీ మంత్రి జూపల్లి ఓడిపోయారు. అక్కడ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఇక్కడా పంచాయతీ నడుస్తోంది. తాండూరులోనే ఇదే కథ.. కాంగ్రెస్ నుంచి గెలిచిన రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో అక్కడ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి టికెట్ విషయంలో జంప్ చేయడానికి చూస్తున్నారు.

ఖమ్మంలో విందు రాజకీయం బీఆర్ఎస్ లో సెగలు రేపుతోంది. సత్తా చాటేందుకు సిద్ధమైన తుమ్మల, పొంగులేటి ప్రయత్నిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలు ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి పుట్టించాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్య నాయకులంతా విందు రాజకీయాలకు తెర లేపారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తన సొంత నియోజకవర్గం ఖమ్మంలోని 17వ డివిజన్‌ నుంచి వాడ వాడకు పువ్వాడ పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రతి డివిజన్‌లో స్థానిక నాయకులు, ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.