Begin typing your search above and press return to search.

రైతు పొలంలో విలువైన వజ్రం.. అమ్మేసు కోబోయి అడ్డంగా దొరికాడు.

By:  Tupaki Desk   |   10 Oct 2020 11:30 PM GMT
రైతు పొలంలో విలువైన వజ్రం..  అమ్మేసు కోబోయి అడ్డంగా దొరికాడు.
X
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బంగారం, వజ్రాల నిక్షేపాలు ఉన్నాయని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా జరిగిన ఓ ఘటన వాటికి బలం చేకూరుస్తోంది. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా (ఇప్పడు రంగారెడ్డి) లోని ఆమనగల్​ మండలానికి చెందిన ఓ రైతు పొలంలో విలువైన భారీ వజ్రం బయటపడింది. అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వజ్రాలు, బంగారు నిక్షేపాలు ఉన్నాయంటూ జియలాజికల్‌ సర్వే ఇండియా (జీఎస్‌ఐ) గతంలో అనేకసార్లు ప్రకటనలు చేసింది. అయితే తాజాగా ఓ రైతు తన పొలంలో చిన్నపాటి గుంత తవ్వుతుండగా ఓ భారీ వజ్రం బయటపడింది. ఈ విషయం అధికారులకు చెబితే తన పొలాన్ని స్వాధీనం చేసుకుంటారేమోనని భావించి గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌ ల్యాబ్‌లో పరీక్షలు చేయించాడు. పరీక్షల్లో అది వజ్రమేనని తేలింది.

అంతటితో సంతృప్తి చెందని సదరు రైతు.. ల్యాబ్‌ నివేదికను వజ్ర నిక్షేపాలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్‌కు చూపించాడు. ప్రొఫెసర్‌ కూడా అది వజ్రమేనని నిర్ధారించారు. ఈ విషయం బయటికి వస్తే తన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందోనన్న ఆందోళన చెందిన రైతు.. దాన్ని బయట పెట్టొద్దంటూ ఆ ప్రొఫెసర్​ను వేడుకున్నాడు. కానీ ఆ ప్రొఫెసర్​ ఈ విషయం బయటకు చెప్పారు. నిజానికి అక్టోబర్​ ప్రారంభంలో ఈ ఘటన జరుగగా ఇప్పుడు ఆలస్యంగా వెలుగుచూసింది. నాలుగు శతాబ్దాల క్రితమే మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి. జీఎస్‌ఐ ఆధ్వర్యంలో ఇక్కడ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో వజ్రాలు, బంగారానికి సంబంధించిన నిక్షేపాలు ఉన్నాయని తేలింది. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన జియో ఫిజిక్స్‌ విభాగం ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. నల్లగొండ జిల్లాలోని రామడుగు, చండూరు, గుర్రంపోడులో వజ్ర నిక్షేపాలు ఉన్నాయని, మిర్యాలగూడ సమీపంలోని ఉట్లపల్లి తదితర ప్రాంతాల్లోనూ రాంప్రెంట్స్‌ (ద్వితీయ శ్రేణి నాణ్యత కలిగిన) వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు ప్రొఫెసర్లు నిర్దారించారు. ఇక్కడ జీఎస్ఐ సర్వే చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కేంద్రానికి నివేదిక ఇచ్చారు. దీనిపై స్పందించిన కేంద్రం సర్వే జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ అంశంపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఏడాది క్రితం నేషనల్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎండీసీ) ఆదేశించింది.