Begin typing your search above and press return to search.

పార్లమెంట్ లోనూ దద్దరిల్లిన తెలంగాణ వరదలు

By:  Tupaki Desk   |   18 July 2022 11:30 AM GMT
పార్లమెంట్ లోనూ దద్దరిల్లిన తెలంగాణ వరదలు
X
పదిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీన్ని 'క్లౌడ్ బరెస్ట్ ' అంటూ సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇందులో విదేశీయుల కుట్ర ఉందని సంచలన కామెంట్స్ చేశారు. ఇక ఈ వరదల కారణంగా గోదావరి నది ఉప్పొంగడంతో అనేక గ్రామాలు వరదలో చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే వేలాది మంది ఇల్లు వదిలి పునరావాస కేంద్రాలకు చేరి తమను ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్నారు.

వరదల మేనేజ్ మెంట్ లో తెలంగాణ ప్రభుత్వ విఫలమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే ప్రధాని మోడీకి తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన లేఖ రాశారు. తాజాగా తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేవంత్ లేఖ రాశారు.

తాజాగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో లోక్ సభలో తెలంగాణ వరదలపై మల్కాజిగిరి ఎంపీ , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో తెలంగాణ వరదలలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైనట్టు కొనసాగుతున్న రచ్చ పార్లమెంట్ కు చేరింది.

పార్లమెంట్ లో తెలంగాణ కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది. పార్లమెంట్ లో వరదల నష్టాన్ని అంచనా వేయాలని.. ప్రత్యేక బృందాలను కేంద్రం పంపాలని.. వరదల సహాయాన్ని తక్షణం విడుదల చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది తెలంగాణ కాంగ్రెస్. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం కింద కల్పించిన హక్కుల అంశాన్ని కూడా కాంగ్రెస్ లేవనెత్తాలని నిర్ణయించారు.

ఈ మేరకు రేవంత్ రెడ్డి వాయిదా తీర్మాణం ఇచ్చారు. తెలంగాణలో గత 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన వరదలు వచ్చాయని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. దీనిపై పార్లమెంట్ లో వెంటనే చర్చ జరపాలని రేవంత్ రెడ్డి వాయిదా తీర్మానంలో కోరారు. వరదల కారణంగా తెలంగాణలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమైందని.. మొత్తంగా 11 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తన తీర్మానంలో రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణ సహాయం ప్యాకేజీ ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని తక్షణం రెండు వేల కోట్ల రూపాయిలు విడుల చేయాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.