Begin typing your search above and press return to search.

జలయుద్ధం: ఏపీకి భారీ షాకిచ్చిన కేసీఆర్

By:  Tupaki Desk   |   17 May 2020 12:34 PM GMT
జలయుద్ధం: ఏపీకి భారీ షాకిచ్చిన కేసీఆర్
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని రాయలసీమకు ఎత్తిపోయాలని నిర్ణయించి పథకం జీవో విడుదల చేసిన మరుక్షణం తెలంగాణ సీఎం కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. కృష్ణా నదిపై తెలంగాణ వాటా నీళ్లకు అన్యాయం జరుగుతుందని కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఏపీతో జలయుద్ధంలో వెనక్కి తగ్గకూడదని నిర్ణయించారు.

*జూరాల ప్రాజెక్టు వద్ద మరో ఎత్తిపోతల

ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను రాయలసీమకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ పెద్ద ప్లాన్ వేశారు. కృష్ణా నది నీళ్లను సమర్థంగా తెలంగాణకు వాడుకోవాలని ఏకంగా జూరాల ప్రాజెక్టు వద్ద మరో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. ఈ మేరకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. జూరాల ప్రాజెక్టు ఎగువన 15 -20 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మాణంపై ప్రభుత్వం నిపుణుల నుంచి నివేదిక కోరింది. ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ దీనిపై సమీక్షిస్తారని సమాచారం.

*గూడెం దొడ్డి, ద్యాగా దొడ్డి వద్ద ప్రాజెక్టుకు అనుకూలం

నిపుణులు ఇప్పటికే థరూర్ మండలం గూడెందొడ్డి, ద్యాగాదొడ్డి గ్రామాల మధ్య కొత్త ప్రాజెక్టుకు అనువైన ప్రదేశంగా నీటి పారుదల శాఖ నివేదికను ఇచ్చింది. రోజుకు ఒక టీఎంసీని ఎత్తిపోసే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేసింది. 20 టీఎంసీల రిజర్వాయర్ నుంచి నెట్టెంపాడు, భీమా1, భీమా2, కోయిల్ సాగర్ కు అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. 30 రోజుల్లోనే 15-20 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రాజెక్టు రూపొందించనున్నారు. ఎక్కువ ముంపు లేకుండా ఈ ప్రాజెక్టును అనువైన చోట డిజైన్ చేస్తున్నారు.

*ఉమ్మడి మహబూబ్ నగర్ లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కొత్త ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల ఏకంగా 6 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందే అవకాశం ఉంటుంది. ఆదివారం ఈ విషయమై కేసీఆర్ ప్రకటించనున్నారు.

*ఏపీ ప్రాజెక్టుకు ధీటుగా తెలంగాణ ప్లాన్

కృష్ణా నది జలాలను రాయలసీమకు తరలించాలన్న ఏపీ ప్లాన్ కు ధీటుగా తెలంగాణ అదే నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ఈ ప్రాజెక్టులను రూపొందింస్తోంది. ఏపీ కంటే ముందున్న తెలంగాణ కృష్ణ జలాలను కరువు జిల్లా అయిన మహబూబ్ నగర్ కు అందించడానికి మరో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడుతోంది. దీంతో ఏపీకి ధీటుగా తెలంగాణ ప్లాన్ చేస్తోంది.