Begin typing your search above and press return to search.

సాగుపై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం: ప్ర‌తియేటా నియంత్రిత విధాన‌మే

By:  Tupaki Desk   |   3 Jun 2020 3:30 PM GMT
సాగుపై సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం: ప్ర‌తియేటా నియంత్రిత విధాన‌మే
X
తెలంగాణ‌లో వ్య‌వ‌సాయం విధానంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్ర‌మంలోనే వ్య‌వ‌సాయం నియంత్రిత పద్ధ‌తిలో చేయాల‌ని, పంటల సాగు డిమాండ్‌కు అనుగుణంగా చేయాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆ విధానం అమలు విష‌య‌మై బుధ‌వారం సీఎం కేసిఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్కెట్‌లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతులు రావాలని సూచించారు. వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఈ సంద‌ర్భంగా సంబంధిత అధికారుల‌కు ఆదేశించారు. ఈ సారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తుందని.. ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్‌లో కొనసాగాలని ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో మూడు రోజుల పాటు విస్తృతంగా చర్చలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా బుధ‌వారం కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

మార్కెట్లో డిమాండ్ ఉండే పంటను మాత్రమే పండిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త విధానంతో పంటకు ధర ద‌క్క‌ని దుస్థితి ఉండదని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పంటల సాగు పద్ధతిగా జరగడం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకుని.. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పంటల సాగు జరగేలా చూడాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. ఇది ఒక్క ఏడాదికో పరిమితం కాద‌ని.. నిరంతరం సాగుతుందని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కమిటీని నియమిస్తుంద‌ని తెలిపారు.

తెలంగాణలో ప్ర‌ధానంగా పత్తి పంట ఎక్కువగా పండిస్తున్నారు. పత్తి సాగు విధానం, రైతుల‌కు లాభ‌దాయ‌కం చేయ‌డం ఎలా అనే దానిపై చ‌ర్చించారు. ఇందులో భాగంగానే ప‌త్తి సాగులో రైతుల‌కు సూచనలు ఇవ్వడానికి, చేదోడువాదోడుగా ఉండడానికి ప్రభుత్వం కాటన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుచేస్తుందని తెలిపారు. నేలలకు అనుగుణంగా ఏ పంట సాగు చేయాలో, పంటల కాలనీల ఏర్పాటు కోసం నేలల విభజన చేయాలని, ఆ వివరాలను రైతులకు తెలపాలని చెప్పారు. ధాన్యంతో పాటు పండ్లు, కూరగాయల సాగు విష‌యంపై కూడా స‌మ‌గ్రంగా వివ‌రాలు సేక‌రించి రైతులు లాభ‌ప‌డేలా పంట‌ల విధానం ఉండాల‌ని సూచించారు.

ముఖ్యంగా ఏడాదిలో కొన్ని రోజులు ఉల్లిగడ్డ ధరలు అధికంగా ఉండే విష‌య‌మై కూడా ముఖ్య‌మంత్రి చ‌ర్చించారు. రాష్ట్ర‌ ప్రజల అవసరాలకు తగ్గట్టు ఉల్లి సాగు జరగాలని, ఎప్పుడూ కొరత లేకుండా చూసే వ్యూహం అవలంభించాలని చెప్పారు. ఎక్కువ పోష‌కాలు ఉండే చిక్కుడు, మునగ సాగును పెంచాల‌ని, ప్ర‌జ‌లు వాటిని అధికంగా తినేలా చేయాల‌ని తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్త‌వ‌డం, మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభ‌వం రావ‌డంతో భూగర్భ జలాలు పెరిగాయని ఈ సంద‌ర్భంగా రైతులంద‌రూ వ్య‌వ‌సాయం చేసేలా ప్రోత్స‌హించాల‌ని సూచించారు. పంటల సాగు ప్రణాళికలు తయారు చేయాల‌ని, హర్టికల్చర్ డిపార్టుమెంటును మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, సరైన పంటల లెక్కల నమోదు కోసం ప్రత్యేకంగా స్టాటిస్టికల్ విభాగం ఏర్పాటు చేయాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు.