Begin typing your search above and press return to search.

కేసీఆర్ నిర్ణయంతో ఉడికిపోతున్న టీ జర్నలిస్టులు

By:  Tupaki Desk   |   12 Oct 2019 5:20 AM GMT
కేసీఆర్ నిర్ణయంతో ఉడికిపోతున్న టీ జర్నలిస్టులు
X
అవసరానికి తగ్గట్లుగా వ్యవహరించటం. వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ వెంట పెట్టుకొని తిరగటం.. అవసరం అయ్యాక వదిలేయటం కొందరికి అలవాటు. ఇలాంటి వాటిల్లో తనకు మించిన మాస్టర్ మైండ్ మరెవరికీ లేదన్నట్లుగా తన చేతలతో చేసి చూపిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఎవరిని ఎప్పుడు వదిలేయాలో గులాబీ బాస్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదంటారు. ఇందుకు తగ్గట్లే తాజాగా తెలంగాణ పాత్రికేయులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన షాకు అంతా ఇంతా కాదు.

తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించటమే కాదు.. తెలంగాణ సాధనలో మాస్టర్ మైండ్ తమదేనని మురిసిపోయే పాత్రికేయులకు ఊహించని రీతిలో కేసీఆర్ సర్కారు నుంచి షాక్ తగిలింది. రాష్ట్ర పాలనకు కేరాఫ్ అడ్రస్ అయిన సచివాలయంలోకి పాత్రికేయులకు ఎంట్రీ లేదని తేల్చేసింది తెలంగాణ ప్రభుత్వం.

కొత్త సచివాలయాన్ని నిర్మించే క్రమంలో సెక్రటేరియట్ ను ఖాళీ చేసి.. బీఆర్కే భవన్ తో పాటు మరికొన్ని భవనాల్లోకి మార్చటం తెలిసిందే. ఎప్పటిలానే సెక్రటేరియట్ బీట్ చూసే రిపోర్టర్లకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. సచివాలయంలోకి పాత్రికేయులకు ఎంట్రీ లేదని.. ఇకపై తాము అనుమతించమంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తేల్చిన వైనం పాత్రికేయులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.

పాత్రికేయుల్లో సీనియర్లు.. కొందరిని మాత్రమే సెక్రటేరియట్ బీట్ కు ఆయా మీడియా సంస్థలు ఎంపిక చేస్తుంటాయి. మొత్తం పాత్రికేయుల్లో సెక్రటేరియట్ బీట్ చూసే రిపోర్టర్లను తోపులుగా అభివర్ణిస్తుంటారు. వీరికి పరిచయాలు ఏకంగా ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రితో పాటు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే ప్రధాన కార్యదర్శితో పాటు.. పలువురు మంత్రులు.. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో సంబంధాలు ఉండటమే కారణం.

అలాంటి బీట్ రిపోర్టర్లకు సెక్రటేరియట్ లో ఎంట్రీ లేదని చెప్పటంతో అవాక్కు అయ్యారు. తెలంగాణ సాధనలో కీలకభూమిక పోషించి.. కోట్లాడి మరీ తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి పరిస్థితా? అంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మీరేమైనా చేసుకోండి.. మేం మాత్రం సెక్రటేరియట్ లోపలకు పాత్రికేయుల్ని రానివ్వం. ఇదేమీ తన సొంత నిర్ణయం కాదని.. ప్రభుత్వ ఆదేశంగా స్పష్టం చేస్తున్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి. ప్రభుత్వం ఏం చెబితే దాన్ని చెయటమే తమ పని అంటూ సీఎస్ స్థాయి వ్యక్తి చెబుతుంటే.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి పరిస్థితిని తాము ఎప్పుడూ ఊహించలేదన్న వేదనను వ్యక్తం చేయటం కనిపిస్తోంది. కేసీఆర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం ఏమిటన్న ఆగ్రహాన్ని పలువురు పాత్రికేయులు వ్యక్తం చేస్తున్నారు.