Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో వివాహ రిజిస్ర్టేష‌న్ త‌ప్ప‌నిస‌రి!

By:  Tupaki Desk   |   23 April 2017 4:49 PM GMT
తెలంగాణ‌లో వివాహ రిజిస్ర్టేష‌న్ త‌ప్ప‌నిస‌రి!
X
తెలంగాణ‌ ప్ర‌భుత్వం త‌మ రాష్ట్రంలో జ‌రిగే వివాహ‌ల రిజిస్ట్రేష‌న్‌ ను చ‌ట్ట‌బ‌ద్దం చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు నూత‌న విధివిధానాల‌ను పొంద‌రుప‌ర్చింది. తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేష‌న్ చ‌ట్టం ప్ర‌కారం ఈ మేర‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. నూత‌న దంప‌తులు త‌మ వివాహాన్ని న‌మోదు చేసుకునేందుకు గాను ద‌ర‌ఖాస్తుతో పాటు వివాహ ద్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని త‌ప్ప‌నిస‌రి జ‌త‌ప‌ర్చాలి. ఆన్‌ లైన్‌ లో న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనుమ‌తి పొందిన ప‌త్రం ఆన్‌ లైన్ ద్వారా స్వీక‌రించ‌వచ్చు. ఇటీవ‌లే సుప్రీంకోర్టు వివాహాల న‌మోదును త‌ప్ప‌నిస‌రి చేసిన నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ మేర‌కు కొత్త నిబంధ‌న‌ను తీసుకువ‌చ్చింది.

తెలంగాణ రాష్ట్ర రిజిస్ర్టేష‌న్ విభాగంలో వ‌ధువు, వ‌రుడు త‌మ ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం స‌రైన ప‌త్రాల‌తో పాటు ఆధార్ కార్డు వివ‌రాల‌ను సైతం న‌మోదు చేయాల్సి ఉంటుంది. తేదీ ఇచ్చిన అనంత‌రం వారు సంబంధిత కార్యాల‌యానికి జాతీయ‌త ధ్రువీక‌ర‌ణ‌, చిరునామా,వ‌య‌స్సు, వివాహ స్థితిని నిర్దారించే ప‌త్రం, ఆధార్ కార్డు వంటివి వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది.

ఇటీవ‌ల కొన్ని ఉదంతాల్లో ఒక‌టికి మించి వివాహం చేసుకునే వారి సంఖ్య పెరిగిన‌ నేప‌థ్యం అలాంటి ప‌రిస్థితికి బ్రేక్ వేసేందుకు సైతం ఈ నిర్ణ‌యం తోడ్ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. కాగా, నూత‌న విధానంలో వివాహాన్ని న‌మోదు చేసుకున్న వారు వారి వివ‌రాల‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవ‌చ్చు. మొద‌టి ద‌శ‌లో ఈ విధానం హైద‌రాబాద్‌ లోని రిజిస్ర్టార్ ఆఫీసులో ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేయ‌డానికి శ్రీ‌కారం చుట్టారు. ఏడాది చివ‌రిక‌ల్లా అన్ని స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దీన్ని అమ‌ల్లో పెట్ట‌నున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/