Begin typing your search above and press return to search.

ఫారిన్ నుంచి శంషాబాద్ కు వస్తున్నోళ్లకు చుక్కలే చుక్కలట

By:  Tupaki Desk   |   19 March 2020 11:30 PM GMT
ఫారిన్ నుంచి శంషాబాద్ కు వస్తున్నోళ్లకు చుక్కలే చుక్కలట
X
కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్ని నేరుగా ఇళ్లకు పంపకుండా కనీసం పదమూడు రోజులు గరిష్టంగా క్వారంటైన్ చేయటం.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.. కరోనా లక్షణాలు ఉన్నాయా?లేవా? అన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా శంషాబాద్ నుంచి వస్తున్న విదేశీ ప్రయాణికుల విషయం లో తెలంగాణ ప్రభుత్వ అధికారులు చేస్తున్న ఏర్పాట్లు.. వ్యవహరిస్తున్న తీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విదేశాల నుంచి వచ్చిన వారిని.. వారి కుటుంబ సభ్యుల తో కలవనీయటం లేదు. ఇదేమీ తప్పు కాకున్నా.. వారిని ఎక్కడకు తీసుకెళుతున్నారన్న కనీస సమాచారం ఇవ్వకపోవటాన్ని తప్పు పడుతున్నారు. అంతేకాదు.. హైదరాబాద్ మహానగరంలోని పలు చోట్ల క్వారంటైన్ ఏర్పాట్లు చేశారు. ఎవరిని ఎక్కడకు తీసుకెళ్లారు? ఎలాంటి వసతులు ఏర్పాటు చేశారు? లాంటివి ప్రశ్న వ్యక్తమవుతున్నాయి.

అయితే.. వీటికి సమాధానాలు లభించటం లేదు. ఎయిర్ పోర్టు నుంచి వారి కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా.. ఎక్కడకు తీసుకెళుతున్నారన్న విషయాన్ని చెప్పట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. క్వారంటైన్ కేంద్రాలకు తరలించే వారి వివరాలు తెలియజేసి.. వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. గడువు లోపు.. పరీక్షలు నెగిటివ్ గా తేలితే ఇంటికి పంపించే విధానం గురించి అవగాహన కలిగేలా చేస్తే బాగుంటుంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా తమ పట్ల అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నట్లుగా కొందరు ఆరోపణలు చేస్తున్నారు.

ఇలాంటివి ఏమైనా చోటు చేసుకుంటే వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విమర్శలు.. ఆరోపణలు ప్రజల్లో భయాందోళనలకు గురి చేయటమే కాదు.. తమకు కరోనా లక్షణాలు కనిపించినా.. వాటిని తమ వద్దే దాచి పెట్టేసుకునే వీలుంది. అదే జరిగితే.. తెలంగాణ రాష్ట్రానికి మరింత ప్రమాదం పొంచి ఉన్నట్లు అవుతుంది. కరోనాకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కారు ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఇలాంటి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వల్ల.. శ్రమకోర్చి చేస్తున్న ప్రయత్నాలు పాజిటివ్ ఫలితాలు ఇవ్వటం మానేసి.. నెగిటివ్ దిశగా అడుగులు పడే ప్రమాదం పొంచి ఉందన్నది మర్చిపోకూడదు.