Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ రవాణాకు తెలంగాణలో భారీ ప్లానింగ్?

By:  Tupaki Desk   |   9 Nov 2020 4:15 AM GMT
వ్యాక్సిన్ రవాణాకు తెలంగాణలో భారీ ప్లానింగ్?
X
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారికి చెక్ పెట్టే సామర్థ్యం వ్యాక్సిన్ కు మాత్రమే ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకే ఒక రౌండ్ పూర్తి చేసుకొని.. సెకండ్ వేవ్ తో ఓపక్క ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతున్నా.. మన దగ్గర మాత్రం ఇంకా మేల్కొనలేదనే చెప్పాలి. సెకండ్ వేవ్ షురూ అయిన దేశాల్లో భారీ ఎత్తున కేసులు నమోదువుతున్నాయి. దీనికి తోడు.. చలికాలం కావటం పరిస్థితి మరింత దారుణంగా మార్చేస్తోంది.

ఇదిలా ఉండగా.. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ జనవరి.. ఫిబ్రవరిలో ఖాయంగా వస్తుందన్న మాట వినిపిస్తోంది. మరి.. వ్యాక్సిన్ తయారై వస్తే.. దాన్ని మారుమూల గ్రామాలకు తరలించి.. అక్కడి వారికి పంపిణీ చేయటం పెద్ద పనే అవుతుంది. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్లాన్ సిద్ధం చేస్తోంది.

వ్యాక్సిన్ రావటం ఒక ఎత్తు అయితే.. దాన్ని అందరికి పంపిణీ అయ్యేలా చేయటం అసలుసిసలు సవాలు. దీనిపై ముందస్తు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. వ్యాక్సిన్ వచ్చినంతనే వేగంగా అందరికి అందుబాటులోకి వచ్చేందుకు వీలుగా ఆర్టీసీకి చెందిన వజ్ర మిని బస్సుల్ని వాడాలని నిర్ణయించారు. ప్రజలందరికి టీకాలు ఇవ్వాలంటే పెద్ద ఎత్తున వాహనాలు అవసరమవుతాయి. ఇందురకోసం టీ ఆర్టీసీ వద్ద ఉన్న వజ్ర బస్సుల్ని ఏమేరకు ఉపయోగించుకోవచ్చన్న అంశంపై చర్చలు సాగుతున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వజ్ర బస్సుల్ని వ్యాక్సిన్ రవాణాకు ఉపయోగించే ప్లాన్ ను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. విమానాల ద్వారా వచ్చే వ్యాక్సిన్ బాక్సుల్ని.. ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా.. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు చేర్చాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన నివేదిక కూడా తయారైనట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే.. మిగిలిన వారి కంటే కూడా తెలంగాణ వ్యాక్సిన్ పంపిణీపై చాలా ముందు ఉందని చెప్పక తప్పదు.