Begin typing your search above and press return to search.

మందుబాబులు పండుగ చేసుకునే వార్త చెప్పిన టీసర్కార్

By:  Tupaki Desk   |   4 Aug 2020 4:00 AM GMT
మందుబాబులు పండుగ చేసుకునే వార్త చెప్పిన టీసర్కార్
X
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆన్ లాక్ 3.0 అమల్లోకి వచ్చిన వేళ.. తనకున్న అధికారాలతో ఊహించని రీతిలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పేసింది. లాక్ డౌన్ వేళలో మద్యం దుకాణాల్ని పూర్తిగా బంద్ పెట్టిన ప్రభుత్వం.. తర్వాత వాటికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాల్ని నిర్వహించేలా నిబంధనల్ని రూపొందించారు.

తాజాగా మద్యం దుకాణాల సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. మందుబాబులకు పండుగే. ఉదయం పది గంటలకు మొదలయ్యే మద్యం దుకాణాలు రాత్రి బాగా పొద్దుపోయే వరకు షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చినట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని జారీ చేశారు.

ప్రభుత్వ ఆదాయం అంతకంతకూ తగ్గిపోతున్న నేపథ్యంలో.. వీలైనంత వరకు ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాల్ని చేస్తోంది. కరోనా అన్నది ఇప్పట్లో పోయేది కాదన్న విషయాన్ని గుర్తించిన తెలంగాణ సర్కారు తన తీరును మార్చుకొంటోంది. ఆంక్షల్ని ఒక్కొక్కటిగా ఎత్తేస్తోంది. ఇందులో భాగంగానే మద్యం దుకాణాలు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్ముకునేలా అవకాశాన్ని కల్పించాయి.

ఇప్పటికి ఉన్న నిబంధనలకు భిన్నంగా ఉదయం 10గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు అమ్మకాలు జరపొచ్చని ప్రభుత్వం పేర్కొంది. అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం రాత్రి పది గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మద్యం అమ్మకాలు భారీగా పెరగటమే కాదు.. సర్కారుకు సైతం ఆదాయాన్ని అందించే అవకాశం ఉందని చెప్పక తప్పదు.