Begin typing your search above and press return to search.

మిడ‌తల‌ దండుపై తెలంగాణ అప్రమ‌త్తం.. త‌రిమికొట్టే సూచ‌న‌లు ఇవే..

By:  Tupaki Desk   |   29 May 2020 9:50 AM GMT
మిడ‌తల‌ దండుపై తెలంగాణ అప్రమ‌త్తం.. త‌రిమికొట్టే సూచ‌న‌లు ఇవే..
X
ఎక్క‌డో ఎడారి ప్రాంత దేశాల నుంచి వ‌యా పాకిస్తాన్ మీదుగా దేశంలోకి మిడ‌త‌ల దండు ప్ర‌వేశించింది. అక్క‌డి నుంచి గుజ‌రాత్‌, రాజ‌స్థాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ త‌దిత‌ర రాష్ట్రాల వైపు అవి ప‌య‌నిస్తున్నాయి. అటు నుంచి తెలుగు రాష్ట్రాల‌పై దాడి కొన‌సాగే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని చెప్ప‌డంతో తెలుగు ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. మిడ‌త‌ల‌ను త‌రిమికొట్టేందుకు ఏయే మార్గాలు ఉన్నాయని నిన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు అధికారుల‌తో చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా నివార‌ణ చ‌ర్య‌ల‌పై దృష్టి పెట్టింది. అయితే సహజంగా పంట పొలాల్లో జీవించే మిడతలతో మాన‌వ ప్ర‌పంచానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే ఆందోళ‌న వ‌స్తోంది. మిడ‌త‌లు ప్ర‌వేశించి కేవ‌లం పంట పొలాల‌పై దాడి చేసి భారీసంఖ్య‌లో పంట న‌ష్టం చేస్తాయ‌ని ఇప్ప‌టివ‌ర‌కు తెలిసిన స‌మాచారం. అయితే వాటి రాక‌తో ఏవైనా వ్యాధులు పొంచి ఉన్నాయా అని అంద‌రిలోనూ రేగుతున్న ప్ర‌శ్న‌.

మిడతల దండు దాడి చేస్తే వాటిని నిలువరించే శక్తి సామర్థ్యాలు ఏమేం ఉన్నాయోన‌ని ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికే ఆలోచ‌న‌లు చేస్తున్నాయి. మిడ‌త‌లు మ‌నం తినే ఆహారాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. మానవాళికి తిండిగింజలు లేకుండా చేస్తాయ‌ని తెలుస్తోంది. ఒక్కరోజులోనే మిడతలు 35 వేల మందికి సరిపోయే ఆహారాన్ని ఆరగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పెద్దఎత్తున పంటను న‌ష్టం చేస్తుండ‌డంతో రైతుల‌తో పాటు మాన‌వ ప్ర‌పంచానికి గ‌డ్డు కాలం పొంచి ఉన్న‌ట్టే. ఆఫ్రికా నుంచి ఇరాన్ పాకిస్తాన్ మీదుగా భారతదేశంలో మిడతల దండు ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్రలోని విదర్భను దాటి తెలంగాణ వైపు అవి దూసుకొస్తున్నాయి.

మిడ‌త‌ల దండు ప్ర‌వేశిస్తుంద‌నే వార్త‌ల‌తో మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న తెలంగాణ‌లోని కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియ‌క గంద‌ర‌గోళ ప‌డుతున్నారు. ఆ మిడతలు ప్ర‌వేశిస్తూనే వాటి సంఖ్య పెంచుకుంటూ వెళ్తుంటాయి. దీంతో వాటి జ‌న‌నాలు పెరిగి మ‌రింత ప్ర‌మాదం వాటిల్లే అవ‌కాశం ఉంది. వాటి సంతతిని పెంచుకోకుండా చూడటం, వాటిని తరిమికొట్టడం వంటి చర్యలు ప్రభుత్వం చేప‌ట్టాలి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై మిడతలను తరిమికొట్టొచ్చు.. ఆందోళన అవసరం లేదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ ఇచ్చే సూచనలు పాటిస్తే పంటలను కాపాడుకోవ‌చ్చ‌ని అధికారులు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా వ్యవసాయ శాఖ మిడతల బారి నుంచి తప్పించుకోవడానికి రైతులకు చేసిన సూచనలు ఇవే..

- మిడతలు తమ పంటలలోకి రాకుండా డబ్బాలు, మెటల్ ప్లేట్లు, డ్రమ్ములు, రేడియో లేదా లౌడ్ స్పీకర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో భారీ శబ్ధాలు వ‌చ్చేలా చేయాలి.
- ఈ శ‌బ్ధాల‌కు భ‌య‌ప‌డి చాలావరకు మిడ‌త‌లు వ‌చ్చే అవ‌కాశం లేదు.
- పొలాల్లో మిడతలు, వాటి గుడ్ల దశను గమనిస్తే క్వినోల్ ఫాస్ పొడి మందులను చల్లాలి. దీనివల్ల వాటి గుడ్లు, పిల్ల పురుగులు నాశనమవుతాయి.
- ఎండిన పొలాల్లో మంటలు రాజేస్తే మిడతల దండు లేదా పిల్ల దశ పురుగులు మంటల్లో పడి నాశనం అవుతాయి.