Begin typing your search above and press return to search.

అప్పు తీసుకోకుంటే నెల గడవటం లేదట

By:  Tupaki Desk   |   18 July 2020 11:50 AM GMT
అప్పు తీసుకోకుంటే నెల గడవటం లేదట
X
నిత్యం ధనిక రాష్ట్రం.. సంపన్న రాష్ట్రం లాంటి మాటల్ని అలవోకగా చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాను భ్రమలో ఉండి.. రాష్ట్ర ప్రజల్ని కూడా భ్రమలో ఉంచుతున్నారా? అన్నది ప్రశ్నగా మారింది.ఆస్తులు బోలెడన్ని ఉన్నా.. ఏ నెలకు ఆ నెలా చేతికి వచ్చే ఆదాయం లక్ష ఉంటే.. ఖర్చు లక్షన్నర ఉందనుకుందాం. దాన్ని ఏమంటారు? అదే ఏ నెలో.. రెండు నెలలవరకో అలాంటి పరిస్థితి ఉంటే అర్థం చేసుకోవచ్చు. అందుకు భిన్నంగా ప్రతి నెలా బయట నుంచి అప్పు తీసుకురాకుంటే బండి నడవదన్నట్లుగా పరిస్థితి మారితే దాన్ని ఏమనాలి? ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనాలి?

తాజాగా2020-21 ఏప్రిల్ నుంచి జులై వరకు దేశంలోని వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పుల లెక్కను ఒక సంస్థ నివేదిక రూపంలో తెస్తే.. అందులో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. మనకంటే నాలుగు రాష్ట్రాలు ముందు ఉన్నాయి కదా? అనుకుంటే అంతకుమించిన పొరపాటు మరొకటి ఉండదు. ఎందుకంటే.. అప్పు తీసుకోకుండా పాలన సాగించే రాష్ట్రాల్ని స్ఫూర్తిగా తీసుకోవాలే తప్పించి.. అప్పు తెచ్చుకోకుంటే నెల గడవదన్న పరిస్థితి మంచిది కాదు.

నిజానికి రాష్ట్ర ఆదాయం ఏడాదికి ఏడాది పెరిగిపోతున్నప్పటికి.. ఖర్చు అంతకుమించి ఉండటంతో అప్పులు తేకుంటే గడవని పరిస్థితి ఉంది. ఈ ఏడాది విషయానికి వస్తే.. ఏప్రిల్.. మే.. నెలల్లో వరుస పెట్టి రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తే.. జూన్ లో రూ4,461 కోట్లు.. జులైలో ఇప్పటివరకూ రూ.2వేల కోట్లు అప్పు చేశారు. ఏడాదికి ఏడాది తీసుకున్న అప్పులు లెక్క చూస్తే.. బేజారు కావాల్సిందే. 2015-16లో రూ.97,992 కోట్లు అప్పు తీసుకుంటే 2016-17లో రూ.1.34లక్షల కోట్లు.. 2017-18లో రూ.1.52లక్షల కోట్లు.. 2018-19లో రూ.1.75లక్షల కోట్లు.. 2019-20లో రూ.1.99లక్షల కోట్లు అప్పుగా తెచ్చారు. ఇక.. ఈ ఏడాది విషయానికి వస్తే రూ.2.29లక్షల కోట్లు అప్పు తేవాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంపన్న రాష్ట్రం ట్యాగ్ వెనకున్న అప్పుల లెక్క ఇప్పుడు అర్థమైందా?