Begin typing your search above and press return to search.

కేసీఆర్ యాక్ష‌న్‌.. బీజేపీ రియాక్ష‌న్‌

By:  Tupaki Desk   |   24 Feb 2022 10:30 AM GMT
కేసీఆర్ యాక్ష‌న్‌.. బీజేపీ రియాక్ష‌న్‌
X
తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడుతో ఇప్పుడు రాజ‌కీయ ప‌రిణామ‌లు కేసీఆర్ వ‌ర్సెస్ బీజేపీగా మారిపోయాయి. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్న కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీని దేశం నుంచి త‌రిమేయాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంపై పోరాటానికి బీజేపీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను కూడ‌గ‌డుతున్నారు. మ‌రోవైపు బీజేపీ కూడా త‌గ్గేదేలే అన్న‌ట్లు కౌంట‌ర్ ఇస్తోంది. విమర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని బీజేపీ రాష్ట్ర నేత‌లు టార్గెట్ చేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కూడా కేసీఆర్‌ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టిన‌ట్లు స‌మాచారం.


వాటితో చెక్‌..

ఏ చ‌ర్య‌కైనా ప్ర‌తిచ‌ర్చ క‌చ్చితంగా ఉంటుంది. రాజ‌కీయాల్లో అది ఇంకా ఎక్కువ. ఇప్పుడు కేసీఆర్ విష‌యంలో బీజేపీ కూడా అదే వైఖ‌రి అవ‌లంబించేందుకు సిద్ధ‌మైంది. అందుకు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై మేడారం వెళ్లిన‌ప్పుడు ఉన్న‌తాధికారులు ప్రోటోకాల్ పాటించ‌క‌పోవ‌డంపై దృష్టి, ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించారంటూ కేసీఆర్ మీడియాను టార్గెట్ చేయ‌డ‌మే నిద‌ర్శ‌నం. ఇటీవ‌ల మేడారం జాత‌ర‌కు గ‌వ‌ర్న‌ర్ వెళ్లారు. అయితే ఆ కార్య‌క్ర‌మంలో మంత్రులు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్పీ ఇలా ఎవ‌రూ క‌న‌బ‌డ‌లేదు. ప్రోటోకాల్ ప్ర‌కారం క‌లెక్ట‌ర్ ఎస్పీ త‌ప్ప‌నిస‌రిగా ఉండి తీరాలి. కానీ జాత‌ర ముగింపు కార్య‌క్ర‌మానికి గ‌వ‌ర్న‌ర్ హాజ‌ర‌య్యే స‌మ‌యానికి అక్క‌డ ఉన్న మంత్రుల‌తో పాటు ఉన్న‌తాధికారులు కూడా జారుకున్నార‌ని తెలిసింది. మంత్రులు లేక‌పోయినా స‌మ‌స్య లేదు. కానీ ఉన్న‌తాధికారులు మాత్రం క‌చ్చితంగా ఉండాలి. దీంతో ఈ విష‌యంపై రాష్ట్రప‌తితో పాటు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యానికి గ‌వ‌ర్న‌ర్ ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం.

సీరియ‌స్ అవుతుంద‌ని..

గ‌వ‌ర్న‌ర్ ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం సీరియ‌స్‌గా మారిపోయింది. కేంద్రానికి గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ఫిర్యాదు చేసింద‌ని తెలియ‌గానే చీఫ్ సెక్ర‌ట‌రీ సోమేష్ కుమార్‌లో టెన్ష‌న్ మొద‌లైంది. ఈ విషయంపై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్సీల‌కు సోమేష్ నోటీసులిచ్చారు.

ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్‌ను కేసీఆర్ దూరం పెడుతున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌తోనే ఉన్న‌తాధికారులు గ‌వ‌ర్న‌ర్ కార్యక్ర‌మంలో లేర‌ని అంటున్నారు. దీంతో కేంద్రం సీరియ‌స్ అయి కేసీఆర్‌ను టార్గెట్ చేసింది.

మ‌రోవైపు కేసీఆర్ సార‌థ్యంలో మీడియా సంస్థ‌లు న‌మ‌స్తే తెలంగాణ, తెలంగాణ టుడేల‌కు స‌భా హ‌క్కుల క‌మిటీ ప‌రిశీల‌న నోటీసులు జారీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా రాష్ట్రప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ప్ర‌ధాని మోడీ ఏపీ విభ‌జ‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను టీఆర్ఎస్ త‌ప్పుప‌ట్టింది.

న‌మ‌స్తే తెలంగాణ‌, తెలంగాణ టుడే ప‌త్రిక‌ల్లోనూ అలాగే వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ స్పీక‌ర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఆ ప‌త్రిక‌లు మోడీ వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించాయ‌ని పేర్కొన్నారు. ఈ ఫిర్యాద‌ను ప‌రిశీలించి లోక్‌స‌భ హ‌క్కులు నైతిక విలువ‌ల విభాగం ఈ రెండు ప‌త్రిక‌ల‌కు నోటీసులు జారీ చేసింది. 72 గంట‌ల్లోగా స‌మాధానం ఇవ్వాల‌ని ఆదేశించింది. ఈ ర‌కంగా కేసీఆర్‌ను బీజేపీ టార్గెట్ చేసింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.