Begin typing your search above and press return to search.

గవర్నర్ వర్సెస్ సీఎం : అసలేమి జరుగుతోంది... ఎందుకలా...?

By:  Tupaki Desk   |   10 Nov 2022 1:30 AM GMT
గవర్నర్ వర్సెస్ సీఎం : అసలేమి జరుగుతోంది... ఎందుకలా...?
X
గవర్నర్లు రాజ్యాంగ రక్షకులు. రాజ్యాంగం ప్రకారం పాలన అంతా వారి చేతుల మీదుగానే సాగుతుంది. ప్రతీ జీవో కూడా గవర్నర్ పేరు మీదనే వస్తుంది. ప్రభుత్వం ఏ చట్టం చేసినా ఆమోదముద్ర మాత్రం గవర్నర్ వేయాల్సిందే. ఇది అనూచానంగా వస్తున్న సంప్రదాయం. ఈ విషయంలో ఎవరికీ రెండవ మాట లేదు. ఎంత గొప్ప ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రి అయినా గవర్నర్లతో పేచీ పూచీలు పెట్టుకోకుండానే ముందుకు సాగుతూ వచ్చారు.

అప్పట్లో ఎన్టీయార్ కి గవర్నర్లకు మధ్య కూడా వివాదం నడచినా ఇంతలా ఎపుడూ వీధిన పడలేదు. కానీ తాజాగా గవర్నర్లు వర్సెస్ సీఎంలు అన్నట్లుగా వాతావరణం తయారైంది. అది కూడా దక్షిణాదినే ఈ వ్యవహారమే కనిపిస్తోంది. ఆ మధ్య దాకా పశ్చిమ బెంగాల్ లో ఇదే సీన్ కనిపించింది. ప్రస్తుత ఉప రాస్ట్రపతి జగదీప్ ధన్ కర్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య ఒక రేంజిలో మాటల యుద్ధం నడచింది.

చివరికి ట్విస్ట్ ఏంటి అంటే ఆయన ఉప రాష్ట్రపతి అయ్యేవేళ తృణమూల్ కాంగ్రెస్ తరఫున విపక్ష ఉప రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇవ్వకుండా మమతా బెనర్జీ తటస్థ వైఖరిని అనుసరించారు. దాంతో అక్కడ వివాదం ముగిసింది. ఇపుడు చూస్తే మరో మూడు దక్షిణాది రాష్ట్రాల గవర్నర్లతో ముఖ్యమంత్రులు నేరుగా తలపడుతున్న పరిస్థితి ఉంది.

ముందుగా తెలంగాణా గవర్నర్ తమిళ్ సై విషయానికి వస్తే గత కొంతకాలంగా ఆమె తో టీయారెస్ సర్కార్ కి ఎక్కడా పొసగడంలేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఇక రాజ్ భవన్ కి వచ్చే కార్యక్రమాలను టీయారెస్ మంత్రులతో సహా ముఖ్యమంత్రి కేసీయార్ మానుకున్నారు. లేటెస్ట్ గా ఈ ఏడాది ఆగస్ట్ 15న ఎట్ హోం కార్యక్రమానికి వస్తానని వర్తమానం పంపించి మరీ కేసీయార్ రాలేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ తమిళ్ సై విమర్శించారు.

ఇపుడు తాజగా మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కేసీయార్ ప్రభుత్వం తన ఫోన్ నే ట్యాపింగ్ చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని కూడా పేర్కొన్నారు. ప్రభుత్వ బిల్లులు పెండింగులో పెట్టడం లేదని వాటిని పరిశీలించిన మీదటనే ఆమోదించడం జరుగుతుందని కుండబద్ధలు కొట్టారు. ఈ విధంగా ఆమె తెలంగాణా సర్కార్ విషయంలో తన గవర్నర్ పాత్ర కచ్చితంగా నిర్వహిస్తాననే అంటున్నారు. రాజ్ భవన్ ప్రగతి భవన్ ఎపుడూ కాదని ఆమె చురకలు అంటిస్తున్నారు.

ఇంకో వైపు గవర్నర్ ప్రభుత్వం చేసే బిల్లులకు ఆమోదముద్ర వేయడం లేదని కావాలనే ఇలా చేస్తున్నారు అని టీయారెస్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ వివాదం చిలికి చిలికి ఎక్కడి దాకా వెళుతుందో ఎవరికీ తెలియడంలేదు. ఇపుడు చూస్తే పొరుగున ఉన్న తమిళనాడు విషయం మరోలా ఉంది. ఆ రాష్ట్ర గవర్నర్ మీద ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మునే సీఎం స్టాలిన్ లేఖ రాశారు. తమకొద్దీ గవర్నర్ అని ఆయన చెబుతున్నారు. ఏడాదిగా ప్రభుత్వం చేసే అన్ని బిల్లులను గవర్నర్ పెండింగులో పెట్టారని ఆయన ఆరోపిస్తున్నారు.

అదే విధంగా చూస్తే తమిళ గవర్నర్ ఆర్ ఎస్ రవి చేస్తున్న ప్రకటనలు ప్రభుత్వానికి అసంతృప్తిగా ఇబ్బందికరంగా ఉన్నాయని కూడా స్టాలిన్ చెప్పడం విశేషం. ఇలా ఒక సీఎం గవర్నర్ మీద నేరుగా రాష్ట్రపతికి లేఖ రాయడం విశేష పరిణామంగా పేర్కొనాలి. ఇంకో వైపు చూస్తే మరో సౌత్ స్టేట్ కేరళలో కూడా గవర్నర్ వర్సెస్ కమ్యూనిస్ట్ సర్కార్ గా వివాదం ఉంది. ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఆయన తాజాగా ఆ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లను రాజీనామా చేయాలని కోరడంతో వివాదం రాజుకుంది. అంతే కాదు తన పరిధిలో ఉండాల్సిన వైఎస్ చాన్సలర్లు ప్రభుత్వం చెప్పినట్లుగా పనిచేస్తున్నారు అని ఆయన అభిప్రాయపడుతున్నారు. దాంతో అక్కడి వైస్ చాన్సలర్లు అంతా న్యాయస్థానానికి వెళ్ళారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల మీద గవర్నర్లు ఇలా పెత్తనం చేయవచ్చా అని లెఫ్ట్ ప్రభుత్వం మండిపడుతోంది.

ఇవన్నీ చూస్తూంటే గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్లు ముఖ్యమంత్రుల మధ్య ఎందుకు వివాదాలు ఎందుకు చెలరేగుతున్నాయన్నది కీలకమైన ప్రశ్న. గవర్నర్లు కేంద్రానికి కాదు రాష్ట్రపతికి బాధ్యులు అని రాజ్యాంగంలో ఉంది. అయితే వర్తమానంలో జరుగుతునది ఏంటి అంటే గవర్నర్లు కేంద్రానికే తాము బాధ్యులనమ్ని కేంద్ర ప్రతినిధులమని భావిస్తూ అక్కడ ప్రభుత్వానికి వ్యతిరకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలని నియంత్రించాలని చూస్తున్నారని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి.

బీజేపీ రాజకీయ అజెండాను రాజ్ భవన్ ద్వారా అమలు చేయించాలని చూస్తున్నారు అని కూడా ఆరోపిస్తున్నారు. ఇక గవర్నర్లు మీడియా తో నేరుగా ఇంటరాక్ట్ అవుతూ ప్రభుత్వ పాలనను పాలసీలను విమర్శిస్తున్నారు అని కూడా అంటున్నారు. మరి ఈ విషయంలో చూస్తే తమకు ఉన్న రాజ్యాంగ హక్కుల మేరకే తాము పనిచేస్తున్నామని గవర్నర్లు అంటున్నారు.

అయితే ఒక్క మాట గతంలో కూడా కొందరు గవర్నర్ల విషయంలో ముఖ్యమంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవం. కానీ ఒకేసారి వరసగా ముగ్గురు నలుగురు గవర్నల మీద ఒకే సమయంలో ఇలా స్థానిక ప్రభుత్వాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయటే సీరియస్ మాటరే. ఇది శృతి మించకుండా వ్యవస్థలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.