Begin typing your search above and press return to search.

విద్యుత్ బిల్లులు వాయిదాల్లో చెల్లించే ఛాన్సు ఇచ్చిన కేసీఆర్

By:  Tupaki Desk   |   7 Jun 2020 4:33 AM GMT
విద్యుత్ బిల్లులు వాయిదాల్లో చెల్లించే ఛాన్సు ఇచ్చిన కేసీఆర్
X
మూడు నాలుగు రోజులుగా ప్రముఖ సినీ నటి స్నేహ భర్త కమ్ నటుడు ప్రసన్న డిమాండ్ ఒకటి తమిళనాడుతో పాటు రెండు తెలుగురాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. లాక్ డౌన్ నేపథ్యంలో భారీగా వస్తున్న కరెంటు బిల్లుల్ని చెల్లించేందుకు వాయిదా పద్దతుల్ని తీసుకురావాలంటూ ఆయన తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. సోషల్ మీడియాలో ఆయన పెట్టిన ట్వీట్ వైరల్ గా మారటమేకాదు.. ఆయనకు మద్దుతుగా పలువురు ఇదే డిమాండ్ ను తెర మీదకు తెస్తున్నారు.

దీనిపై తమిళనాడు విద్యుత్ పంపిణీ వ్యవస్థ నుంచి కానీ.. తమిళనాడు ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సానుకూల ప్రకటన రాలేదు. ఇందుకు భిన్నంగా.. ప్రసన్న ఏ డిమాండ్ అయితే చేశారో.. ఇప్పుడు అదే విధానాన్ని ప్రకటించింది తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ. రూల్ ను మార్చే అవకాశం తమకు లేని నేపథ్యంలో.. లాక్ డౌన్ తర్వాత మూడు నెలల బిల్లులు భారీగా రావటంతో.. ఆ మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించే వెసులుబాటు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.

తాజాగా జారీ చేసిన విద్యుత్ బిల్లులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తమకు రెగ్యులర్ గా వచ్చే బిల్లులతో పోలిస్తే.. ఎక్కువ మొత్తంలో వస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో.. ఆ మొత్తాన్ని కట్టలేని పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు. వేసవిలో కరెంటు వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఈసారి లాక్ డౌన్ కావటం.. ఇంట్లో నుంచి బయటకు కదలకపోవటంతో కరెంటు వినియోగం ఎక్కువగా ఉంది.

దీనికి తోడు.. మూడు నెలల సరాసరిని తీసి బిల్లులు వేయటం కూడా.. బిల్లుమొత్తం కొంత పెరగటానికి కారణంగా భావిస్తున్నారు. దీంతో..బిల్లు చెల్లింపులకు పలువురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటివేళ..కాస్తంత ఉపశమనం కలిగే విధానాన్ని ప్రకటించారు. దీని ప్రకారం.. బకాయి మీద 1.5శాతం వడ్డీతో కలిసి.. వాయిదాల రూపంలో బిల్లు చెల్లించే వీలుందని చెబుతున్నారు. అయితే.. ఎన్ని వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది? దాని విధివిధానాలు ఏమిటనన విషయంపై స్పష్టమైన ప్రకటన ఇంకా వెలువడలేదు.