Begin typing your search above and press return to search.

ఇన్ ఛార్జ్ కాదు.. పూర్తిస్థాయి పోలీస్ బాస్‌

By:  Tupaki Desk   |   10 April 2018 4:23 AM GMT
ఇన్ ఛార్జ్ కాదు.. పూర్తిస్థాయి పోలీస్ బాస్‌
X
ఐదు నెల‌ల వెయిటింగ్ ఫ‌లించింది. చేతికి అందిన పండును పూర్తిగా తినే ప‌రిస్థితి లేక‌పోతే ఎలా ఉంటుంది? తెలంగాణ‌కు ఇన్ ఛార్జ్ డీజీపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌హేంద‌ర్ రెడ్డి ప‌రిస్థితి ఇంచుమించు ఇదే రీతిలో ఉంద‌ని చెప్పాలి. పేరుకు డీజీపీ కానీ.. దాని ముందు ఇన్ ఛార్జ్ అన్న మాట పోయి పూర్తిస్థాయి రావ‌టానికి ఐదు నెల‌ల స‌మ‌యం ప‌ట్టింది. తాజాగా మ‌హేంద‌ర్ రెడ్డిని పూర్తిస్థాయి డీజీపీగా నియ‌మిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం అధికారిక నిర్ణ‌యం తీసుకుంది.

దీనికి సంబంధించిన ఫైల్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ సంత‌కం చేశారు. ప్ర‌భుత్వ ఆదేశాలు బ‌య‌ట‌కు రావాల్సిన ప్ర‌క్రియ మాత్ర‌మే మిగిలి ఉంది. డీజీపీగా అనురాగ్ శ‌ర్మ రిటైర్ అయ్యాక.. మ‌హేంద‌ర్ రెడ్డిని ఇన్ ఛార్జ్ డీజీపీగా నియ‌మించారే కానీ పూర్తిస్థాయిగా నియ‌మించ‌లేదు. గ‌త ఏడాది న‌వంబ‌రు 12న మ‌హేంద‌ర్ రెడ్డి ఇన్ ఛార్జ్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

డీజీపీ ఎంపిక మొన్న‌టి వ‌ర‌కూ కేంద్రం చేతిలో ఉండేది. దాని స్థానే రాష్ట్రాలే స్వ‌యంగా నియ‌మించుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తూ చ‌ట్ట‌ప‌ర‌మైన మార్పులు చేయ‌టంతో మ‌హేంద‌ర్ రెడ్డిని పూర్తిస్థాయి డీజీపీగా ఎంపిక చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో డీజీపీ ఎంపిక పూర్తిగా కేంద్రం చేతిలో ఉండేది. రాష్ట్రం తాము అనుకుంటున్న ఇద్ద‌రు అధికారుల పేర్ల‌ను కేంద్రానికి పంపితే.. కేంద్రం ఒక నిర్ణ‌యం తీసుకునేది.

దీనిపై సుప్రీంకోర్టు ఇటీవ‌ల ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో.. డీజీపీ నియామ‌కాన్ని రాష్ట్రాలే చేసుకునే వీలు క‌ల్పిస్తూ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ చేశారు. దీంతో.. ఇప్ప‌టివ‌ర‌కూ ఇన్ ఛార్జ్ డీజీపీగా ఉన్న మ‌హేంద‌ర్ రెడ్డిని పూర్తిస్థాయి డీజీపీగా నియ‌మిస్తూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంత‌కం చేసేశారు. సో.. మ‌హేంద‌ర్ రెడ్డి ఇక‌పై తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి పోలీస్ బాస్ అయిపోయిన‌ట్లే!