Begin typing your search above and press return to search.

వైరింగ్ మార్చే దానికి రూ.400 కోట్లు ఖ‌ర్చా సారూ?

By:  Tupaki Desk   |   10 July 2019 5:39 AM GMT
వైరింగ్ మార్చే దానికి రూ.400 కోట్లు ఖ‌ర్చా సారూ?
X
న‌మ్మ‌కాల్ని ఎక్కువ‌గా ఫాలో అయ్యే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌చివాల‌యాన్ని మొత్తంగా నేల‌మ‌ట్టం చేసి.. దాని స్థానే త‌న క‌ల‌ల సౌధాన్ని నిర్మించాల‌ని డిసైడ్ కావ‌టం తెలిసిందే. ఈ విష‌యంపై పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక‌.. విప‌క్షాలైతే.. ఎట్టి ప‌రిస్థితుల్లో ఇప్పుడున్న స‌చివాల‌యాన్ని కూల్చేందుకు తాము ఒప్పుకోమ‌ని.. అందుకు ఎంత‌వ‌ర‌కైనా వెళ‌తామ‌ని భీక‌ర ప్ర‌తిజ్ఞ‌లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ విష‌యంపై హైకోర్టులో కేసు వేయ‌టం.. దాని విచార‌ణ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. భ‌వ‌నాల్ని కూల్చొద్దంటూ ఆదేశాలు జారీ చేసిన ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో కొత్త‌గా క‌ట్టాల‌నుకుంటున్న స‌చివాల‌యం మీద తెలంగాణ ప్ర‌భుత్వం త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపించింది. ఇప్పుడున్న భ‌వ‌నాలు ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని పేర్కొంది.

ప్ర‌స్తుతం ఉన్న స‌చివాల‌యంలో వ‌స‌తులు స‌రిగా లేవ‌ని.. అగ్నిప్ర‌మాద నిరోధ‌క వ్య‌వ‌స్థ లేద‌ని.. అనుకోని ప్ర‌మాదం జ‌రిగితే ప్ర‌ముఖుల‌ను త‌ర‌లించే అత్య‌వ‌స‌ర మార్గాలు లేవ‌ని పేర్కొంది. ప్ర‌భుత్వ విధాన నిర్ణ‌యాల్లో కోర్టుల పాత్ర ప‌రిమిత‌మని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల్ని ఆశించి వేసే పిటిష‌న్ల‌ను కొట్టివేయాల‌ని కోరిన ప్ర‌భుత్వం.. ఎల‌క్ట్రిక్ వైరింగ్ లోపాల కార‌ణంగా గ‌డిచిన ప‌దేళ్ల‌లో 34 అగ్నిప్ర‌మ‌దాలు చోటు చేసుకున్న‌ట్లుగా త‌న కౌంట‌ర్లో చెప్పింది. ప్ర‌స్తుతం ఫైళ్లు భ‌ద్ర‌ప‌రిచే కె బ్లాక్ శిథిలావ‌స్థ‌లో ఉంద‌ని.. అక్క‌డ జీవోలు.. పైగాలు.. సాలార్ జంగ్ ఎస్టేట్‌.. జాగీర్.. రెవెన్యూ.. హోంశాఖ‌ల‌కు చెందిన కీల‌క‌ప‌త్రాలు ఉన్న‌ట్లుగా చెప్పారు.

1956 నుంచి పోగుబ‌డుతున్న ఫైళ్ల‌ను భ‌ద్ర‌ప‌ర్చేందుకు స్థ‌లం స‌రిపోవ‌టం లేద‌ని కోర్టుకు దాఖ‌లు చేసిన పిటిష‌న్లో పేర్కొంది. తెలంగాణ ప్ర‌భుత్వ వాద‌న‌నే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే.. ఎల‌క్ట్రిక్ వైరింగ్ లోపాల‌కు ఎవ‌రైనా భ‌వ‌నాలు కూల్చేస్తారా? అన్న‌ది క‌శ్చ‌న్. వైరింగ్ మొత్తాన్ని తీసేసి.. కొత్త వైరింగ్ వేస్తే స‌రిపోయే దానికి.. భ‌వ‌నాల్ని నేల‌మ‌ట్టం చేసి కొత్త భ‌వ‌నాల్ని నిర్మించాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌.

విలువైన ద‌స్త్రాల్ని దాచేందుకు స్థ‌లం స‌రిపోవ‌టం లేద‌ని.. స‌ద‌రుభ‌వ‌నం శిధిల‌మైంద‌ని చెప్పిన వాద‌నే స‌రైన‌ద‌ని భావిద్దాం. అలాంటి దానికి.. కె బ్లాక్ వ‌ర‌కూ నేల‌మ‌ట్టం చేసి.. మ‌రో భారీ భ‌వ‌నం క‌ట్టేస్తే స‌రిపోతుంది. ఇక‌.. ఫైళ్ల‌ను సుర‌క్షిత‌మైన వేర్ హౌస్ గౌడెన్ లో భ‌ద్ర‌ప‌రిస్తే స‌రిపోతుంది క‌దా? పెద్ద పెద్ద బ్యాంకులు.. బీమా సంస్థ‌లు న‌గ‌ర శివారులో ప్ర‌త్యేకంగా నిర్మించిన వేర్ హౌస్ ల‌లో ఫైళ్ల‌ను భ‌ద్ర‌ప‌రిచే అంశాన్ని మ‌ర్చిపోకూడ‌దు. అలాంట‌ప్పుడు ప్ర‌భుత్వ‌మే రంగంలోకి దిగితే మ‌రెన్ని ప్ర‌త్యామ్నాయాలు ఉంటాయి. అలాంటి వాటిని వ‌దిలేసి.. స‌చివాల‌యం మొత్తాన్ని కూల‌దోయాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌. మ‌రి.. ఇలాంటి ప్ర‌శ్న‌ల్ని హైకోర్టు సంధిస్తుందో? లేదో? చూడాలి.