Begin typing your search above and press return to search.

బోనాలు బోర్డ‌ర్ దాటేశాయి!

By:  Tupaki Desk   |   15 July 2018 5:15 AM GMT
బోనాలు బోర్డ‌ర్ దాటేశాయి!
X
ఆషాఢ మాసం వచ్చింది. బోనాల సందడి తీసుకువచ్చింది. తెలంగాణలో ఎంతో ప్రఖ్యాతి పొందిన - సందడి నిండిన బోనాల పండుగ ఈ ఆదివారం నుంచే ప్రారంభం అవుతుంది. ముందుగా గోల్కండలో బోనాల పండుగకు శ్రీకారం చుడతారు. చివరి బోనాల ఉత్సవం బోయిగూడాలో జరుగుతుంది. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఇంతకు ముందు కేవలం తెలంగాణ రాజధాని హైదరాబాద్ - జంటనగరం సికింద్రాబాద్ లలోనూ - తెలంగాణ గ్రామాల్లోనూ మాత్రమే జరిగేది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా బోనాలు పండుగ నిర్వహిస్తున్నారు.

అమెరికా - ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ - న్యూజిల్యాండ్ తో పాటు మరికొన్ని దేశాల్లోనూ బోనాలు పండుగను జరుపుకుంటున్నారు. ఇక తెలంగాణ వారున్న పలు రాష్ట్రాల్లోనూ బోనాలు పండుగ జరగడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం బోనాలు పండుగ నిర్వహణకు దాదాపు 20 కోట్ల రూపాయలు కేటాయించింది. బోనాలు ఉత్సవాల కోసం ఓ కమిటీ నియమించింది. ఈ సారి ఈ కమిటీకి రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి చైర్మన్‌ గా నియమితులయ్యారు. ఈయనతో పాటు నగరానికి చెందిన మంత్రులు - తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నగర నాయకులు ఈ కమిటీలో సభ్యులు. జంట నగరాలలో బోనాల పండుగకు విశేష గుర్తింపు ఉండడంతో బోనాల పండుగకు మీడియా కూడా ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో జరిగే భవిష్య వాణి కార్యక్రమానికి విశేష స్పందన ఉంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెరిగినా... ఏ సమయంలో ఏది జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నా భవిష్య వాణి ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. ప్రభుత్వ పెద్దలు కూడా భవిష్య వాణి గురించి ఆశగా ఎదురు చూస్తారు.

ఆదివారం నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ - మంత్రులు నాయిని నర్శింహారెడ్డి - తలసాని శ్రీనివాస యాదవ్ - పద్మారావు బోనాల పండుగను లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు - కల్లుపాక సమర్పిస్తారు. అమ్మవారికి ప్రసాదంగా సమర్పించే ఫలహారం బళ్లకు విశేషమైన గుర్తింపు ఉంది. వివిధ ప్రాంతాల వారు అమ్మవారికి ఈ ఫలహారం సమర్పిస్తారు. ఫలహారం బళ్లను వివిధ పూలు - పళ్లు - రంగు రంగు కాగితాలతో అలంకరించి మేళతాళాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకు వస్తారు. ఈ వేడుకకు ఎంతో విశిష్టత ఉంది. మరోవైపు ఈ నెల రోజుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చే ఆదాయం మిగిలిన నెలల కంటే రెట్టింపు ఉండడం కొసమెరుపు.