Begin typing your search above and press return to search.

అనంత‌కు కేసీఆర్ దెబ్బ మామూలుగా లేదంట‌

By:  Tupaki Desk   |   22 Jun 2017 4:48 AM GMT
అనంత‌కు కేసీఆర్ దెబ్బ మామూలుగా లేదంట‌
X
కొన్ని అంశాలు సంబంధం లేన‌ట్లుగా క‌నిపిస్తాయి కానీ.. త‌ర‌చి చూస్తే వాటి మ‌ధ్య‌నుండే సంబంధాలు బ‌య‌ట‌కు రావ‌ట‌మే కాదు.. కాస్త ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంటాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రిస్టేజియ‌స్ గా తీసుకున్న గొర్రెల పంపిణీ కార్య‌క్ర‌మం ఏపీని మ‌రోలా దెబ్బేస్తుంది. అన్నింటికి మించి తెలంగాణ‌ రాష్ట్ర ఏర్పాటుతో అంద‌రి కంటే ఎక్కువ‌గా ఎఫెక్ట్ అయిన అనంత‌పురం జిల్లా.. తాజా గొర్రెల ఎపిసోడ్‌లోనూ కేసీఆర్ దెబ్బ ప‌డుతోంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

తెలంగాణ‌లోని గొల్ల.. కురుమ‌.. యాద‌వ వృత్తిదారుల కోసం గొర్రెల్ని ప్ర‌త్యేక ప్యాకేజీ ద్వారా పంపిణీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీగా గొర్రెల్ని తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకురావ‌టం ద్వారా.. రానున్న మూడేళ్ల వ్య‌వ‌ధిలో రూ.25వేల కోట్ల సంప‌ద‌ను సృష్టించ‌ట‌మే త‌న ల‌క్ష్యంగా సీఎం కేసీఆర్ ప‌దే ప‌దే చెబుతుండ‌టం తెలిసిందే. తెలంగాణ రూపు రేఖ‌ల్ని మార్చేస్తుంద‌ని భావిస్తున్న ఈ గొర్రెల ప‌థ‌కానికి సంబంధించి ఆస‌క్తిక‌ర కోణం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. తెలంగాణ‌కు భారీ ఎత్తున తీసుకొస్తున్న గొర్రెల్లో అధిక భాగం అనంత‌పురం జిల్లా నుంచేన‌న్న విష‌యం ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది.

పెద్ద ఎత్తున గొర్రెల్ని కొనుగోలు చేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం పుణ్య‌మా అని ఇప్పుడు గొర్రెల అమ్మ‌కందారుకు మంచి రేటు వ‌స్తోంది. అయితే.. ఇంత భారీగా గొర్రెలు ఒక్క‌సారిగా ఏపీ నుంచి త‌ర‌లిపోవ‌టం వ‌ల్ల భ‌విష్య‌త్తులో గొర్రెల కొర‌త ఏర్ప‌డ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

తెలంగాణ ప్ర‌భుత్వం టార్గెట్ గా పెట్టిన గొర్రెల్ని సేక‌రించటానికి తెలంగాణ అధికారుల దృష్టి అనంత‌పురం.. క‌ర్నూలు.. క‌డ‌ప మీద ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే ఒక్క అనంత‌పురం జిల్లాలోనే 38.75 ల‌క్ష‌ల గొర్రెలు ఉన్నాయి. దీంతో.. పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు అనంత‌పురం అనువుగా ఉండ‌టంతో పాటు.. త‌ర‌లింపు కూడా ఈజీ అన్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న లెక్క‌ల ప్ర‌కారం దాదాపుగా అనంత‌పురం జిల్లా నుంచే రెండు.. మూడు ల‌క్ష‌ల గొర్రెలు తెలంగాణ‌కు వెళ్లి ఉంటాయ‌ని చెబుతున్నారు.

అనంత‌పురం జిల్లాలోని రాయ‌దుర్గం.. క‌ల్యాణ‌దుర్గం ప్రాంతాల్లో ద‌ళారుల సాయంతో భారీ ఎత్తున గొర్రెల్ని తెలంగాణ అధికారులు కొనుగోలు చేసిన‌ట్లు చెబుతున్నారు. ఒకేసారి ఇంత భారీగా గొర్రెలు త‌ర‌లివెళ్ల‌టంతో ఏపీకి ఇబ్బందిక‌రంగా మార‌నుంద‌ని చెబుతున్నారు. అనంత జిల్లాకు చెందిన గొర్రెల మీద తెలంగాణ అధికారులు దృష్టి పెట్ట‌టానికి కార‌ణం లేక‌పోలేద‌ని చెబుతున్న కొంద‌రు.. సంతానోత్స‌త్తికి ప‌నికి వ‌చ్చే గొర్రెలు ఈ జిల్లాలో ఎక్కువ‌గా ఉంటాయ‌ని.. అందుకే వీటిని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల సాకారానికి ఏపీ గొర్రెలు కావాల్సి వ‌చ్చింద‌న‌టంలో సందేహం లేదు. కాకుంటే.. ఒకేసారి పెద్ద ఎత్తున గొర్రెల్ని కోల్పోవ‌టం ఏపీకి అంత మంచిది కాద‌ని చెబుతున్నారు.