Begin typing your search above and press return to search.

కేసీఆర్ జీ.. ఆగస్టు 2న జీతాలు అందలేదు

By:  Tupaki Desk   |   3 Aug 2016 5:25 AM GMT
కేసీఆర్ జీ.. ఆగస్టు 2న జీతాలు అందలేదు
X
వేతనజీవులు నెలంతా పని చేసేది ఫస్ట్ తారీఖున వచ్చే జీతం కోసమేనని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు.ఎవరి అభిరుచులకు తగ్గట్లు వారు కెరీర్ ను ప్లాన్ చేసుకున్నా.. అంతిమంగా అదో ఆదాయవనరుగా మారటం.. ఆ డబ్బు కోసం నెలంతా కష్టపడుతుంటారు. వేతనజీవులకు ఎంతో కీలకమైన జీతాల విషయంలో తెలంగాణ సర్కారు తప్పటడుగు వేసిందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రభుత్వం కానీ ప్రైవేటు సంస్థ కానీ తమకు ఎన్ని ఇబ్బందులున్నా.. నెలాఖరు రోజున లేదంటే నెల మొదటి రోజున జీతాలు ఇవ్వటం చాలా కీలకం. ఈ జీతం రాళ్ల మీదనే చాలానే ప్లాన్లు ఉంటాయి.

తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర సర్కారు.. ఆగస్టు ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులు.. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకపోవటమే కాదు.. ఆగస్టు 2న కూడా జీతాలు అందకపోవటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆగస్టు 1న సెలవు కావటంతో జీతాలు ఆగాయని భావించిన ఉద్యోగులకు.. రెండో తేదీన కూడా జీతాలు పడకపోవటం ఆసక్తికరంగా మారింది. బిల్లుల పాస్ మీద మౌఖిక ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఇలా జరిగిందని కొందరు.. ఫ్రీజింగ్ లో ఉన్నందున తాము ఏమీ చేయలేకపోతున్నామన్న మాటలు అధికారుల నోటి నుంచి పొంతన లేని సమాదానాలు రావటం గమనరాహం.

అయితే.. ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం జీతాలకు సంబంధించిన బిల్లులు తెలంగాణలోని అత్యధిక జిల్లాల్లోని ట్రెజరీ కార్యాలయాల్లోనే పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ.. కృష్ణా పుష్కరాలు.. హరితహారం లాంటి వాటికినిధుల్ని సర్దుబాటు చేయటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని... అందుకే జీతాలు తప్పమరే బిల్లులు చెల్లించొద్దన్న మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు.

అయితే.. అందుకు భిన్నంగా ఆగస్టు 2న కూడా జీతాలు చెల్లింపులు జరగకపోవటం పలువురు ఉద్యోగుల్లో ఆందోళన షురూ అయ్యింది. అంతేకాదు.. ఉద్యోగులు జీపీఎఫ్ అడ్వాన్స్ లు పొందే వీలుంది. అలాంటి వాటిని కూడా గడిచిన రెండునెలలుగా నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. ఏదిఏమైనా జీతాలు రెండో తేదీకి కూడా ఇవ్వకపోటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరీ.. విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎరుకకు వెళ్లిందంటారా?