Begin typing your search above and press return to search.

మంత్రుల నిధులన్నీ కొడుక్కే

By:  Tupaki Desk   |   7 Aug 2015 10:30 AM GMT
మంత్రుల నిధులన్నీ కొడుక్కే
X
గ్రామ జ్యోతి పథకం ఉద్దేశం ఏమిటో తెలుసా? ఆ పథకాన్ని అసలు ఎందుకు ప్రవేశపెడుతున్నారో తెలుసా? పలువురు మంత్రుల పరిధిలో ఉన్న నిధులన్నిటినీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కొడుకు కేటీఆర్ పరిధిలోకి తీసుకు రావడానికే ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. ఆయా నిధుల ఖర్చుపై సదరు మంత్రులకు ఎటువంటి అవకాశం లేకుండా చేసి.. వాటిని ఖర్చు చేసే పూర్తి అధికారం తన కుమారుడికి కట్టబెట్టేందుకే గ్రామ జ్యోతి పథకం. దాదాపు పాతిక వేల కోట్ల రూపాయల నిధులను తన కుమారుడి శాఖకు కట్టబెట్టడానికే ఈ ఎత్తు అని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి.

ఈనెల 15వ తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా గ్రామ జ్యోతి పథకానికి శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికే ఈ పథకమని ఇప్పటికే చెప్పారు. అయితే, గ్రామీణ నీటి పారుదల, రోడ్లు భవనాలు, వైద్య ఆరోగ్యం, విద్య, తదితర వివిధ శాఖల కింద ఇప్పటి వరకు చేపట్టే పనులను ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ కిందికి తీసుకొస్తారు. ఆయా శాఖల కింద జరిగే పనులన్నిటినీ పంచాయతీరాజ్ శాఖ అనుమతితో చేస్తారు. పనులు ఎప్పట్లాగే జరుగుతాయి. కానీ, అవి జరిగేది.. వాటికి అనుమతి ఇచ్చేది.. నిధులు విడుదల చేసేది మాత్రం పంచాయతీరాజ్ శాఖ. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ అధీనంలో ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ముఖ్యమంత్రి తన కుమారుడికి వాటర్ గ్రిడ్ ను కట్టబెట్టారని, అది పాతిక వేల కోట్ల రూపాయలు అయితే, ఇప్పుడు అన్ని శాఖల నిధులను గ్రామ జ్యోతి కిందకు తీసుకొచ్చి మరో పాతిక వేల కోట్లను తన కుమారుడు ఖర్చు చేసుకోవడానికి వీలుగా పావులు కదిపారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇంతకు మించి ఈ పథకంలో ప్రత్యేకత ఏమీ లేదని పెదవి విరుస్తున్నారు.