Begin typing your search above and press return to search.

పెట్రోల్.. డీజిల్ మీద తెలంగాణ‌కు ఎంత ఆదాయ‌మంటే?

By:  Tupaki Desk   |   5 May 2019 5:55 AM GMT
పెట్రోల్.. డీజిల్ మీద తెలంగాణ‌కు ఎంత ఆదాయ‌మంటే?
X
సంక్షేమ కార్య‌క్ర‌మాల్ని అదే ప‌నిగా ప్ర‌క‌టిస్తూ.. వారికి ఇంత చేశాం.. వీరికి ఇంత చేస్తున్నామ‌ని గొప్ప‌లు చెప్పే ప్ర‌భుత్వాలు క‌నిపిస్తుంటాయి. మిగిలిన రాష్ట్రాల‌తో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ ప‌థ‌కాల పేరుతో వేలాది కోట్ల‌ను ఖ‌ర్చు చేస్తున్న వైనం క‌నిపిస్తుంటుంది. మ‌రి.. ఈ సంక్షేమ ప‌థ‌కాల‌కు అయ్యే ఖ‌ర్చుకు సంబంధించిన ఆదాయం ఎక్క‌డి నుంచి వ‌స్తుంది? ఏ రూపంలో ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేస్తార‌న్న విష‌యం లోతుల‌కు వెళితే.. ఆస‌క్తిక‌ర అంశాలు క‌నిపిస్తాయి.

సామాన్యుడు నుంచి సంప‌న్నుడి వ‌ర‌కూ నిత్యం పెట్రోల‌.. డీజిల్ ను వినియోగించ‌ని వారు ఉండ‌రు. అలాంటి నిత్యాస‌వ‌ర వ‌స్తువు మీద ప్ర‌భుత్వం విధించే ప‌న్ను పోటు దేశంలోనే మ‌రెక్క‌డా లేనంత ఎక్కువ‌గా తెలంగాణ‌లో ఉంద‌న్న మాట వినిపిస్తుంటుంది. తాజాగా గ‌డిచిన ఆర్థిక సంవ‌త్స‌రంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి.. వీటి ద్వారా వ‌స్తున్న మొత్తం లెక్క‌లు వింటే అవాక్కు అవ్వాల్సిందే.

ఎందుకంటే.. పెట్రోల్.. డీజిల్ అమ్మాల‌పై విధించిన ప‌న్ను ద్వారా 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.9,176 కోట్ల ఆదాయం వ‌స్తే.. 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి ఏకంగా రూ.10,142 కోట్ల ఆదాయం రావ‌టం గ‌మ‌నార్హం. నిత్యం ప‌న్నుబాదుడు బాదేస్తూ.. ఆ వ‌చ్చిన మొత్తాన్ని సంక్షేమ ప‌థ‌కాల‌కు మ‌ళ్లించ‌టం ఏమిటో?

ఇదిలా ఉంటే.. గ‌డిచిన ఆర్థిక సంవ‌త్స‌రంలో తెలంగాణ రాష్ట్రం ఆదాయాన్ని ఆర్జించే విష‌యంలో ముంద‌డుగు ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌తి శాఖ నిర్దేశిత ల‌క్ష్యాల్ని అధిగ‌మించి.. 101 శాతం మేర ప‌న్నులు వ‌సూలు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. పెద్ద రాష్ట్రాల కంటే వృద్ధి రేటులో తెలంగాణ పురోగ‌తి సాధించింది.

గ‌డిచిన ఆర్థిక సంవ‌త్స‌రంలో పెట్రోల్.. డీజిల్ ద్వారా ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ.10,142 కోట్లు రాగా.. మ‌ద్యంపై వేసే ప‌న్నుల‌తో రూ.9,473 కోట్ల ఆదాయం వ‌చ్చింది. ఇక‌.. వ‌స్తు సేవ‌ల ప‌న్ను జీఎస్టీ పేరుతో గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏకంగా రూ.25,764 కోట్ల ఆదాయం రావ‌టం గ‌మ‌నార్హం. ఇక‌.. ఇత‌ర ప‌న్నుల ద్వారా మ‌రో రూ.1592 కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లుగా ప్ర‌భుత్వం పేర్కొంది. ఆదాయం రాక బాగానే ఉన్నా.. పోక విష‌యంలోనే ఒక క‌ట్టుబాటు లేన‌ట్లుగా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.