Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ కేసుతో తెలంగాణ స‌ర్కారు ఊపిరి పీల్చుకుందా?

By:  Tupaki Desk   |   22 July 2017 9:36 AM GMT
డ్ర‌గ్స్ కేసుతో తెలంగాణ స‌ర్కారు ఊపిరి పీల్చుకుందా?
X
ఇప్పుడు హైద‌రాబాదు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో... ప్ర‌త్యేకించి తెలంగాణ‌లో ఏం జ‌రుగుతోంది. డ్ర‌గ్స్ కు అల‌వాటు ప‌డ్డ వ్య‌క్తులు, ఆ దందా నుంచి అందే సొమ్మును జేబుల్లో వేసుకుంటున్న నేర‌గాళ్లు న‌గ‌రాన్ని పాడు చేసేస్తున్నారు. ఇది నిజ‌మే.. అయినా డ్ర‌గ్స్ రాకెట్లు ప‌ట్టుబ‌డ‌టం హైద‌రాబాదులో ఇదే తొలి సారా? లేక డ్ర‌గ్స్ వాడుతున్న సినీ స్టార్లు ప‌ట్టుబ‌డ‌గం ఇది ఫ‌స్ట్ టైమా? కానేకాద‌న్న స‌మాధానమే వ‌స్తుంది. మ‌రి ఇప్పుడు కేవ‌లం ముగ్గురు స‌భ్యులున్న డ్ర‌గ్స్ రాకెట్ ప‌ట్టుబ‌డిన ఈ కేసుకు గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఎందుకు ప్రాధాన్యం ల‌భించింది. ఈ ప్ర‌శ్న‌కు కొన్ని వ‌ర్గాలు... ప్ర‌త్యేకించి విప‌క్ష పార్టీల‌కు చెందిన కొంద‌రు నేత‌ల‌ నుంచి ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం వినిపిస్తోంది. టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర‌రావు ఆధ్వ‌ర్యంలోని తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ అంశానికి ఇంత‌గా ప్రాధాన్యం ఇచ్చింద‌న్న‌దే ఆ వ‌ర్గాల వాద‌న‌గా వినిపిస్తోంది. ఆ క‌థాక‌మామీషేమిటో చూద్దాం ప‌దండి.

తెలంగాణ‌లో మొన్న‌టిదాకా సంచ‌ల‌న అంశాలుగా భూ కుంభ‌కోణాలు వినిపించాయి. భాగ్య‌న‌గ‌రి హైద‌రాబాదుతో పాటు న‌గ‌ర శివారు ప్రాంతాలు - రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లో వెలుగులోకి వ‌చ్చిన ప‌లు భూకుంభ‌కోణాల్లో అధికార పార్టీ టీఆర్ ఎస్‌ కు చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల పేర్లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని విప‌క్షాలు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఇక భూ కుంభ‌కోణాల‌కు అండ‌గా నిలిచి మొత్తం కార్యాన్ని ఏమాత్రం బ్రేకులు లేకుండా నడిపించిన ప‌లువురు స‌బ్ రిజిస్ట్రార్లు స‌స్పెన్ష‌న్‌ కు గుర‌వ‌డ‌మే కాకుండా... ఏకంగా అరెస్టై జైల్లో కూర్చున్నారు. మ‌రి ఈ త‌ర‌హా ప‌రిస్థితి మ‌రింత కాలం పాటు కొన‌సాగితే... టీఆర్ ఎస్ ప‌రువు గంగ‌లో క‌లిసిపోయిన‌ట్లేన‌న్న‌ది విశ్లేష‌కుల వాద‌న‌. అంతేకాదండోయ్‌... మ‌రో ఏడాదిన్న‌ర త‌ర్వాత జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఈ అంశం తీర‌ని న‌ష్టం జ‌ర‌గ‌డం ఖాయమేన‌న్న వాద‌న కూడా వినిపించింది.

మ‌రి ఈ విష‌యం మీద నుంచి అటు మీడియాతో పాటు జ‌నం దృష్టిని మ‌ర‌ల్చేది ఎలాగంటూ ప్ర‌భుత్వ పెద్ద‌లు త‌లలు ప‌ట్టుకున్నార‌ట‌. స‌రిగ్గా అదే స‌మ‌యంలో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి అకున్ స‌బ‌ర్వాల్ నేతృత్వంలోని తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్ మెంట్ శాఖ... కెల్విన్ న‌డుపుతున్న డ్ర‌గ్స్ రాకెట్‌ ను ప‌ట్టుకుంది. అంతే మీడియా దృష్టిని డైవ‌ర్ట్ చేసే అంశం దొరికిపోయింద‌న్న భావ‌న‌తో రంగంలోకి దిగేసిన ప్ర‌భుత్వ పెద్ద‌లు ఈ అంశానికి మ‌రింత‌గా ప్రాధాన్యం ల‌భించేలా పావులు క‌దిపారని విప‌క్ష నేత‌లు చెప్పుకుంటున్నారు. కెల్విన్ ఫోన్‌ లో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఉన్నార‌న్న స‌మాచారాన్ని అకున్ కంటే ముందుగానే మీడియాకు లీక్ చేయించ‌డం ద్వారా వారు అనుకున్న‌ట్లే మీడియా దృష్టిని డైవ‌ర్ట్ చేశారట‌. ఇంకేముంది... డ్ర‌గ్స్ రాకెట్‌లో సినీ పరిశ్ర‌మ అంటూ మైకులు ప‌ట్టుకుని ప‌రుగులు పెట్టిన మీడియా... అప్ప‌టిదాకా తాము ప్ర‌చారం చేసిన భూ కుంభ‌కోణాల‌ను ప‌క్క‌న‌పెట్టేసిందని ఆ నేత‌ల వాద‌న‌.

గంట‌కో సినీ ప్ర‌ముఖుడి పేరును బ‌య‌ట‌పెడుతుంటే... ఆయా మీడియా సంస్థ‌ల టీఆర్పీ రేటింగ్స్ అమాంతంగా పెరుగుతుండ‌టంతో ఇక ల్యాండ్ స్కాంల‌ను పూర్తిగా మ‌రిచిపోయిన‌ట్లుగా ఆయా మీడియా సంస్థ‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయట‌. దీంతో ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారిన ల్యాండ్ స్కాంల అంశం మ‌రుగున‌ప‌డిపోగా... అప్ప‌టికే అరెస్టూ జైల్లో కూర్చున్న స‌బ్ రిజిస్ట్రార్లు బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చేశారని చెబుతున్నారు. రేపో మాపో వారు త‌మపై అమ‌ల‌వుతున్న స‌స్పెన్స్‌ను ఎత్తివేయించుకుని విధుల్లో కూడా చేరిపోతార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక న‌గ‌రంలోని మియాపూర్ కుంభ‌కోణంతో లెక్క‌లేనన్ని వార్త‌లు రావ‌డంతో అప‌ప్ర‌ద మూట‌గ‌ట్టుకున్న గోల్డ్ స్టోన్ ప్ర‌సాద్ ను జ‌నం ఇట్టే మ‌రిచిపోయారట‌. అంతిమంగా విప‌క్షాల వాద‌న ఏంటంటే... భూ కుంభ‌కోణాల‌పై మీడియా, ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ రాకెట్‌ పై జ‌రుగుతున్న ద‌ర్యాప్తున‌కు విపరీతంగా ప్రాధాన్యం ఇచ్చింద‌న్న మాట‌. మొత్తం జ‌రుగుతున్న తంతును చూస్తే ఈ మాట నిజమేన‌ని ఒప్పుకోక త‌ప్ప‌దేమో.