Begin typing your search above and press return to search.

నో కాసుల గలగల; ‘‘టీ’’కి బాగా టైట్

By:  Tupaki Desk   |   23 July 2015 4:36 AM GMT
నో కాసుల గలగల; ‘‘టీ’’కి బాగా టైట్
X
‘‘మాది సంపన్న రాష్ట్రం.. మేం ఆ విషయాన్ని సగర్వంగా చెబుతున్నాం’’ అంటూ తరచూ చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటకు భిన్నంగా.. తెలంగాణ సర్కారు ఇప్పుడు కాసుల కష్టాల్లోకూరుకుపోయింది. మిగులు బడ్జెట్ తో 14 నెలల క్రితం ఏర్పడిన తెలంగాణకు నెల రోజుల నుంచి కాసుల కష్టాలు తప్పటం లేదు.

ఐటీ శాఖకు కట్టాల్సిన బ్రూవరేజ్ సంబంధించిన పన్ను విషయంలో ఐటీ శాఖకు.. తెలంగాణ సర్కారుకు మధ్య లొల్లి నడుస్తున్న సంగతి తెలిసిందే. తమకు రావాల్సిన బకాయిల్ని తీసుకునేందుకు ఆర్ బీఐ ని సంప్రదించిన ఐటీ శాఖ.. మారు మాట్లాడకుండా.. తెలంగాణ సర్కారకు చెందిన రూ.1200కోట్లను తన ఖాతాలోకి మళ్లించుకోవటంతో కాసుల కష్టాలు మొదలయ్యాయి.

ఒక్కసారిగా రూ.1200కోట్లు చేతి నుంచి చేజారిపోవటం.. కాస్త ఆలస్యంగా మేల్కొన్న సర్కారు.. జారిపోయిన డబ్బుల్ని తిరిగి తమ ఖాతాలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించినా.. ఫలితం లేని పరిస్థితి. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఉండే భరోసాకి.. చేతిలో కాసులు లేనప్పుడు ఉండే పరిస్థితి ఎలా ఉంటుందో తెలంగాణ సర్కారుకు తెలిసి వచ్చింది.

ఆర్థిక పరిస్థితి టైట్ గా మారటంతో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో.. ఎంతో ముఖ్యమైన చెల్లింపులకు తప్పించి.. మిగిలిన ఖర్చులకు చెల్లింపులు ఇవ్వటం తగ్గించేశారు. చివరకు విద్యుత్తు.. టెలిఫోన్ బిల్లులకు కూడా నో చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి తాత్కలికమే అని చెబుతున్నారు. గత నెల రోజులుగా అత్యవసర చెల్లింపులు తప్పించి.. మిగిలిన వాటిని నిలిపివేయాలని చెబుతూ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ నుంచి అన్నీ శాఖలకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.

దీంతో.. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.300కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయిన పరిస్థితి. విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ మొదలు ఉపకార వేతనాలు.. మధ్యామ్న భోజనానికి చెల్లించే బిల్లులు సహా.. అది ఇది అన్న తేడా లేకుండా అన్ని బిల్లుల్ని ఆపేశారు. అత్యవసరం.. తప్పదన్న వాటికి మాత్రమే చెల్లింపు జరుపుతున్నారు.

నిన్నటి వరకూ డబ్బు కష్టం అన్నది తెలీకుండా ఉన్న అధికారులకు.. ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త కష్టం ఎదురుకావటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఐటీ శాఖ మళ్లించుకున్న రూ.1200కోట్లు వెనక్కి వస్తాయని..ఒక్కసారి అవి కానీ చేతికి వస్తే.. మళ్లీ క్యాష్ టైట్ అన్న మాట ఉండదని చెబుతున్నారు. చేజారిన కాసు.. చేతికి రావటం అంత చిన్న విషయమా? ఇప్పటికే ఈ ప్రయత్నం చేసి.. చేసి.. అలసినా తెలంగాణ సర్కారు మాత్రం ఇదే నమ్మకంతో ఉండటం గమనార్హం.