Begin typing your search above and press return to search.

కేసీఆర్ నిజాలు చెప్పాల్సిన టైమొచ్చింది

By:  Tupaki Desk   |   16 Oct 2015 7:12 AM GMT
కేసీఆర్ నిజాలు చెప్పాల్సిన టైమొచ్చింది
X
దేశంలోని ధనిక రాష్ట్రాల జాబితాలో గుజరాత్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ర్టం. మ‌నం బంగారు తెలంగాణ కోసం ముందుకు సాగుదాం అంటూ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌కు....వాస్త‌వ ప‌రిస్థితుల‌కు పొంతన లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పాలకులు ధనిక రాష్ట్రమంటూ ఊదరగొడుతున్న తెలంగాణలో అప్పుల పరంపర కొనసాగుతోందని ఆర్థిక వేత్త‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.

తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,201.80 కోట్ల రుణం తీసుకుంది. ఈ మొత్తంపై ఏడాదికి 7.98 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. ఆర్‌ బీఐ నిబంధనల ప్రకారం...రుణాన్ని పదేళ్లలోపు తిరిగి చెల్లించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16)లో ఇప్పటి వరకు మొత్తం రూ.10,549 కోట్ల రుణాన్ని ప్రభుత్వం స్వీకరించింది. బాండ్లు - సెక్యూరిటీలను వేలం వేయటం ద్వారా సర్కారు ఈ అప్పుల్ని తీసుకుందని స‌మ‌చారం. ఫిస్కల్‌ రెస్పాన్సిబులిటీ అండ్‌ బడ్జెటరీ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌ ఆర్‌ బిఎమ్‌) చట్టం నిబంధనలు, పరిమితులకు మేర‌కు వ‌చ్చే ఏడాది 2016 మార్చి చివరి నాటికి తెలంగాణ సర్కారుకు మొత్తం రూ.14 వేల కోట్ల రుణాన్ని స్వీకరించే వెసులుబాటు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలు కాలమంతా ఆర్థికపరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం...రానున్న ఐదు నెలల సమయాన్ని ఏ విధంగా నెట్టుకొస్తుందనేది వేచి చూడాల్సిన అంశం.

తెలంగాణ ప్ర‌భుత్వానికి ఆదాయానికి సంబంధించిన విష‌యంలో అంచనాలు తలకిందులవ‌డం వ‌ల్లే ఈ పరిస్థితులు ఎదుర‌య్యాయని నిపుణులు పేర్కొంటున్నారు. భూముల అమ్మకాల ద్వారా రూ.13,500 కోట్ల ఆదాయాన్ని రాబడతామంటూ తొలి బడ్జెట్‌ లో అంచ‌నా వేసిన ప్ర‌భుత్వం పెద్ద‌లు రెండో బడ్జెట్‌ సమయానికి వాస్తవాలను గమనించారు.భూముల విక్రయం ద్వారా రూ.6,500 కోట్లను ఆర్జిస్తామంటూ లెక్క‌లు మార్చారు. అయితే ఈ అంచనా కూడా ఇప్పుడు వాస్తవ రూపం దాల్చలేదు. దీంతో అప్పులు అనివార్యమవుతున్నాయని అధికారవర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల వ్యయం కూడా అంచనాలకు మించి ఉంటోందని, ఫలితంగా ఖజానాపై విపరీత భారం పడుతోందని స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ లోటును పూడ్చుకునే క్రమంలో రుణాలు తీసుకోక తప్పటం లేదని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు గ్రహించిన రుణాలు

ఏప్రిల్‌ రూ.1,000 కోట్లు
మే రూ.1,348 కోట్లు
జూన్‌ రూ.1,300 కోట్లు
జులై రూ.2,500 కోట్లు
ఆగస్టు రూ.800 కోట్లు
సెప్టెంబరు రూ.1,200 కోట్లు
అక్టోబరు రూ.1,201.80 కోట్లు