Begin typing your search above and press return to search.

సీఎం సార్‌..బ‌తుక‌మ్మ చీరల బాకీ ఇంకా తీర్చ‌లేద‌ట‌

By:  Tupaki Desk   |   30 Sep 2017 5:34 AM GMT
సీఎం సార్‌..బ‌తుక‌మ్మ చీరల బాకీ ఇంకా తీర్చ‌లేద‌ట‌
X
అనుకున్న‌ది ఒక‌టి అయిన‌ది మ‌రొక‌టి. సిరిసిల్ల నేత‌న్న‌ల ముఖాల్లో చిరున‌వ్వులు చిందేలా చేయ‌టం కోసం తెలంగాణ రాష్ట్రంలోని కోటి మందికి పైగా మ‌హిళ‌ల‌కు నేత చీర‌ల్ని బ‌తుక‌మ్మ పండ‌గ సంద‌ర్భంగా పంపిణీ చేయాల‌న్న నిర్ణ‌యాన్ని తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు తీసుకోవ‌టం తెలిసిందే. కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణ‌యంతో సిరిసిల్ల వ‌స్త్ర ప‌రిశ్ర‌మ నుంచి 52 ల‌క్ష‌ల చీర‌లను అందించారు.

దీనికి సంబంధించి దాదాపు రూ.25 కోట్ల మొత్తాన్ని విడుద‌ల చేయాల్సి ఉంది. తొలి విడ‌త‌లో విడుద‌ల చేసిన రూ.43 కోట్ల‌లో రూ.10 కోట్లు ప‌వ‌ర్ లూం మ్యాక్స్ సొసైటీల ఖాతాల్లోకి ఇంకా చేర‌లేద‌ని చెబుతున్నారు. బ‌తుక‌మ్మ చీర‌ల త‌యారీ బాధ్య‌త అప్ప‌గించిన తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యంతో త‌మ బ‌తుకుల్లో కొత్త వెలుగులు విర‌బూస్తాయ‌ని.. ఆర్థిక ఇబ్బందులు తీర‌తాయ‌ని ప‌లువురు నేత‌న్న‌లు భావించారు.

అయితే.. చీర‌ల్ని తీసుకెళ్లిన స‌ర్కారు బ‌కాయిల్ని మాత్రం చెల్లించ‌క‌పోవ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. బ‌కాయిలు స‌కాలంలో చెల్లిస్తే త‌మ‌పై భారం ఉండ‌ద‌ని.. ఆల‌స్య‌మైతే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని చెబుతున్నారు. సిరిసిల్ల‌లోని మొత్తం 317 చిన్న త‌ర‌హా ప‌వ‌ర్ లూం ప‌రిశ్ర‌మ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌లు ఉత్ప‌త్తి చేసే అవ‌కాశాన్ని క‌ల్పించారు. వీరంతా క‌లిసి 3.72 కోట్ల మీట‌ర్ల వ‌స్త్రాన్ని ఉత్ప‌త్తి చేసి ఇచ్చారు. ఇందుకు 15వేల మ‌ర‌మ‌గ్గాలు ఉప‌యోగించారు
.
మొత్తం 12500 మంది కార్మికులు.. మ‌రో నాలుగువేల అనుబంధ కార్మికులకు బతుక‌మ్మ చీర‌ల త‌యారీ కార‌ణంగా ఉపాధి ల‌భించింది. భారీ ఎత్తున ఆర్డ‌రు రావ‌టంతో చిన్న‌త‌ర‌హా ప‌వ‌ర్ లూం ప‌రిశ్ర‌మ‌ల నిర్వాహ‌కులు అప్పులు తెచ్చి మ‌రీ వ‌స్త్రాల్ని ఉత్ప‌త్తి చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. తీసుకెళ్లిన వ‌స్త్రానికి ఇవ్వాల్సిన కోట్లాది రూపాయిల్ని తిరిగి చెల్లించే విష‌యంపై ప్ర‌భుత్వం దృష్టి సారించ‌క‌పోవ‌ట‌మే ఇప్పుడు స‌మ‌స్య‌గా మారింది.

వ‌స్త్రాలు ఇచ్చిన వెంట‌నే డ‌బ్బులు వ‌చ్చేస్తాయ‌ని భావించిన వారు వ‌డ్డీకి తెచ్చిన డ‌బ్బుల్ని పెట్టుబ‌డిగా పెట్టారు. అయితే.. అంచ‌నాల‌కు భిన్నంగా బ‌కాయిల మొత్తాన్ని ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కూ చెల్లించ‌క‌పోవ‌టంతో బ‌తుక‌మ్మ చీర‌లు కొత్త బ‌తుకును ఇవ్వాల్సింది పోయి అస‌లుకే ఎస‌రుగా మారింది.

బ‌కాయిల్ని క్లియ‌ర్ చేయాల్సిన చేనేత జౌళిశాఖ డైరెక్ట‌ర్ శైల‌జ రామ‌య్యార్ అక్టోబ‌రు 20 వ‌ర‌కు సెల‌వులో ఉండ‌టం.. అప్ప‌టివ‌ర‌కూ బ‌కాయిలు క్లియ‌ర్ అయ్యే అవ‌కాశం లేద‌న్న మాట‌తో నేత‌న్న‌ల నోటి నుంచి మాట రాని ప‌రిస్థితి. ఇంత‌కాలం బ‌కాయిలు నిలిపిస్తే త‌మ ప‌రిస్థితి దారుణంగా ఉందంటున్నాయి. సింగ‌రేణి గుర్తింపు కార్మికుల సంఘానికి జ‌రిగిన‌ట్లుగా సిరిసిల్ల చేనేత నేత‌లన్న‌కు ఏదైనా ఎన్నిక‌లు జ‌రిగి..దాన్ని అధికార‌ప‌క్షం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటే పాతిక కోట్లేంది.. యాభై కోట్లు అయినా పరుగులు పెడుతూ వ‌స్తాయి. అలాంటిదేమీ లేన‌ప్పుడే ఇప్పుడున్న ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే బ‌తుక‌మ్మ చీర‌లు త‌యారు చేసినోళ్లు బ‌కాయిల భారంతో కిందామీదా ప‌డుతుంటే.. బ‌తుక‌మ్మ చీర‌ల కాన్సెప్ట్ తో లేనిపోని తిప్ప‌లు కొని తెచ్చుకున్నామ‌న్న భావ‌న అధికార‌ప‌క్ష నేత‌ల్లో ఉండ‌టం గ‌మ‌నార్హం.