Begin typing your search above and press return to search.

పోలీసులకు కేసీఆర్ సర్కారు బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   2 Dec 2015 4:46 AM GMT
పోలీసులకు కేసీఆర్ సర్కారు బంపర్ ఆఫర్
X
కొన్ని వర్గాల మీద అంతులేని ప్రేమను ప్రదర్శించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా పోలీసులకు సరికొత్త వరాన్ని ప్రకటించింది. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం తీసుకొని సరికొత్త నిర్ణయాన్ని తీసుకొని పోలీసు వర్గాల మనసును కేసీఆర్ సర్కారు దోచుకోనుందని చెబుతున్నారు.

ఆర్మీ.. ఎన్ సీసీ క్యాంటీన్ల మాదిరే పోలీసు క్యాంటీన్లలో ఇకపై విక్రయించే వస్తువులకు వ్యాట్ మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా.. సబ్బులు లాంటి నిత్యవసర వస్తువలపై 14.5 శాతం మేర పన్ను భారం తగ్గే వీలుంది. మరికొన్ని వస్తువులకు అంతకు మించి భారీ వ్యత్యాసం కలగనుంది. దీంతో.. పోలీసు క్యాంటీన్ లో వస్తువులు కొనుగోలు చేసే పోలీసులకు భారీ ఉపశమనం లభించనుంది.

నిత్యవసర వస్తువులు.. సబ్బులు.. షాంపూలు.. బూస్ట్ లాంటి పానీయాలతో పాటు.. రెడీమెడీ దుస్తులు.. బల్బులు.. ఫ్యాన్లు.. ఇలా ఒకటి రెండు ఏమిటి? పోలీస్ క్యాంటీన్లో అమ్ముడయ్యే వస్తువులన్నింటికి వ్యాట్ నుంచి ఉపశమనం లభించనుంది. తెలంగాణ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో బహిరంగ మార్కెట్లతో పోలిస్తే.. పోలీస్ క్యాంటీన్ లో ధరల మధ్య వ్యత్యాసం పెద్ద ఎత్తున ఉండే వీలుంది. నెలసరి బడ్జెట్ మీద ఇదెంతో ప్రభావం చూపించటం ఖాయమని చెబుతున్నారు. తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంపై పోలీసు వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.