Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ వాడిన వారు దోషులు కాదు..బాధితులు!

By:  Tupaki Desk   |   28 July 2017 5:06 PM GMT
డ్ర‌గ్స్ వాడిన వారు దోషులు కాదు..బాధితులు!
X
హైదరాబాద్‌ లో క‌ల‌క‌లం రేకెత్తిస్తున్న డ్ర‌గ్స్ మాఫియాపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు స‌మ‌క్షంలో ప‌లు విభాగాల అధికారులు ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ చేశారు. హైద‌ర‌బాద్‌ లో తెర‌మీద‌కు వ‌చ్చిన డ్ర‌గ్స్ మాఫియా దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని హైద‌రాబాద్ వైపు తిప్పిన నేప‌థ్యంలో త‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగిసిన అనంత‌రం హైద‌రాబాద్‌ కు వ‌చ్చిన వెంట‌నే స‌మీక్షా స‌మ‌వేశం ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ - హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి - ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ - ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్ - సెక్యూరిటీస్ ఐజీ ఎన్.కె.సింగ్ - ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ - సైబరాబాద్ జాయింట్ సీపీ షానవాజ్ ఖాసిం - తరుణ్ జోషి తదితరుల‌తో డ్రగ్స్ కేసుపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారి బాగా వ్యాపించిందనే ప్రచారం చాలా తప్పని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా లేదని, కానీ అసలు దానికి ప్రవేశమే దొరకకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

దేశ వ్యాప్తంగా డ్రగ్స్ ఎక్కువగా వాడే - సరఫరా ఎక్కువగా జరిగే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదని - నగరాల్లో హైదరాబాద్ లో లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ డ్రగ్స్ భూతం తెలంగాణలో ప్రవేశించకూడదని - వ్యాప్తి చెందకూడదని గట్టిగా నిర్ణయించిన ప్రభుత్వం - మూలాలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నదని - ఇప్పటికే కీలక ఆధారాలు - సూత్రధారుల వివరాలు లభించాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. కొంత మంది సినీ ప్రముఖులతో పాటు ఇతరులు కూడా మన దగ్గర డ్రగ్స్ వాడుతున్నట్లు త‌మ దృష్టికి వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ``డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం వచ్చిన 12 మంది సినీ ప్రముఖులను గుర్తించాం. వారిని విచారిస్తున్నాం. వారిని నేరస్తులుగా పరిగణించడానికి లేదు. వారిని బాధితులుగానే చూడాలి. డ్రగ్స్ అమ్మకం - సరఫరా చేయడం - వ్యాపారం చేయడం నేరం. కానీ వాడడం నేరం కాదు`` అని పోలీసు అధికారులు విశ్లేషించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగించాలని, నేరస్తులెవరైనా పట్టకుని శిక్ష పడేలా చూడాలని కోరారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తూ - దేశానికే ఆదర్శంగా ఉందని - అలాంటి రాష్ర్టంలో డ్రగ్స్ లాంటి దందాలు అడుగు పెట్టకుండా ఆదిలోనే అంతం చేయాలని ఆదేశించారు. ఈ సంద‌ర్బఃగా అధికారులు మాట్లాడుతూ `` డ్రగ్స్ వాడుతున్న వారిని విచారిస్తే సరఫరా చేసే వారి గుట్టురట్టవుతుంది. సరఫరా చేసే వారు, అమ్మే వారు - వ్యాపారం చేసే వారు అంతా తెలుస్తారు. తీగలాగితే డొంక కదిలినట్లు వాడుతున్న వారిని విచారిస్తే దందా చేస్తున్న వారి వివరాలు తెలుస్తాయి. అదే క్రమంలో మాకిప్పుడు వాడుతున్న వారి వివరాలు, దందా చేస్తున్న వారి వివరాలు తెలిసాయి. వీటి ఆధారంగానే విచారణలు - అరెస్టులు - దర్యాప్తు సాగుతున్నది. ఇప్పటివరకు సాగిన విచారణలో సినీ రంగానికి చెందిన వారు వాడుతున్నట్లుగానే తేలింది. ఒకవేళ అమ్మకం దారులు, సరఫరా చేసే వారిలో సినీ ప్రముఖులుంటే వారిపై కూడా కేసులు పెడతాం. ఇప్పటి వరకు ఈ కేసులో సినీ రంగానికి చెందిన 12 మందితో పాటు, మరో 27 మందిని విచారించాము. ఇద్దరు విదేశీయులతో పాటు 22 మందిని అరెస్టు చేశాము. అరెస్టయిన వారిలో సినీ రంగానికి చెందిన వారు లేరు. ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ వాడకం దారులను బాధితులుగానే పరిగణిస్తున్నాం. వ్యాపారం చేసిన వారిని, సరఫరా చేస్తున్న వారిని మాత్రమే నేరస్తులుగా పరిగణిస్తున్నాం. కేసు దర్యాప్తులో వాడకం దారులను క్లూ(ఆధారం)గా వాడుకుంటున్నాం. దర్యాప్తులో వారి సహకారం తీసుకుంటున్నాం. స్పెయిన్ - థాయిలాండ్ - పోర్చుగల్ - నైజీరియా - నెదర్లాండ్స్ - కొలంబియా లాంటి దేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నట్లు సమాచారం అందింది. కొందరు ముఖ్యమైన వారి పేర్లు కూడా తెలిశాయి. కీలక ఆధారాలు కూడా లభించాయి. విచారణ కొనసాగిస్తున్నాం. సినీ రంగాన్ని లక్ష్యం చేసుకుని విచారణ సాగుతుందనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఐటి పరిశ్రమలో కూడా డ్రగ్స్ వాడకం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదు. సామాజిక రుగ్మతలను అరికట్టాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విచారణ సాగుతున్నది’’ అని పోలీసు అధికారులు సీఎంకు వివరించారు.