Begin typing your search above and press return to search.

రైతు వాకిట్లోకి వెళ్లకుంటే ఛీ అంటారు జాగ్రత్త!

By:  Tupaki Desk   |   15 Sep 2015 4:35 AM GMT
రైతు వాకిట్లోకి వెళ్లకుంటే ఛీ అంటారు జాగ్రత్త!
X
పరిస్థితులు వికటించినప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఇవాళ కొత్త సంగతి కాదు. అలాగే ప్రతి రైతు యొక్క ఆత్మహత్యకు కేసీఆర్‌ అనే వ్యక్తి, లేదా చంద్రబాబు అనే వ్యక్తి బాధ్యులు కూడా కాదు. అనేక రకాల కారణాలు, కష్టాలు కలిసి వారిని ఆత్మహత్య అనే అంతిమ నిర్ణయం వైపు తీసుకువెళుతూ ఉంటాయి. ఇవి ఒక వ్యక్తినుంచి మరొక వ్యక్తికి మారుతూ ఉంటాయి. అయితే ప్రభుత్వంలో ఉన్నందుకు ఇలా అర్థంతరంగా జీవితాన్ని కడతేర్చుకున్న వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడం.. చేయగలిగిన సాయం అందించడం.. భరోసా కల్పించడం కనీస బాధ్యత. ఆ విషయంలో అంతో ఇంతో ఏపీలోని చంద్రబాబు సర్కారు కాస్త మెరుగ్గా ఉంది. పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. మంత్రులు స్వయంగా వారి కుటుంబం వద్దకు వెళ్లి.. కాస్త సాయం అందించి పరామర్శించి వస్తున్నారు.

ఈవిషయంలో తెలంగాణ సర్కారు ఫెయిలవుతోంది. మంత్రులు కార్యాలయాలు కదిలి... రైతు వాకిట్లోకి వెళ్లకపోవడం వలన.. అక్కడకు వెళ్లడానికి వారు ప్రతిపక్షాలకు అవకాశం కల్పిస్తున్నారు. రైతు చావుల వెనుక బాధ్యత తమది గనుకనే.. ప్రభుత్వం పలాయనం చిత్తగిస్తోందని.. రావడానికి భయపడుతున్నదనే విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. ఏదో తమ వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా అసలు నాయకులు భుజాలు తడుముకోవడం ఎందుకు? మనస్ఫూర్తిగా రైతుల ఇళ్లకువెళ్లి.. ప్రెస్‌ మీట్‌ లలో చెప్పే ధైర్యవచనాలు వారికే చెప్పవచ్చు కదా అనేది పలువురి సందేహం.

తెలంగాణ సర్కారు లెక్కలు ఏవిధంగా ఉన్నాయో గానీ.. రైతు ఆత్మహత్యలను పూర్తిగా తోసిపుచ్చలేని స్థితిలోనే వారు కూడా ఉన్నారు. మంత్రులు ఎలా మాట్లాడుతున్నా.. అన్నీ ఉత్తుత్తి నిందలే అంటూ ప్రతిపక్షాల్ని ఆడిపోసుకున్నా .. ఈ విషయంపై ప్రజల ముందు బహిరంగ చర్చలకు వస్తున్న ఎంపీ కవిత లాంటి వాళ్లు ఒక రకంగా ఆత్మహత్యలను అంగీకరిస్తున్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా చనిపోయిన వారి కుటుంబాల్ని దత్తత తీసుకుంటాం అని ఆమె అంటున్నారు.

అయినా.. మిగులు బడ్జెట్‌ ఉన్న.. ఫ్లై ఓవర్‌ లాంటి అభివృద్ధి పనులకు వేల కోట్ల రూపాయలను సింగిల్‌ ఉత్తర్వులతో ఖర్చుపెట్టేయగలిగిన స్థోమత ఉన్న ప్రభుత్వం సజీవంగా ఉన్నప్పుడు.. కవిత ఎందుకు దత్తత తీసుకోవాలి. ఆమె కంటె ముందుగా ప్రభుత్వ ప్రతినిధులు - మంత్రిస్థాయికి తగ్గనివారు బాధిత కుటుంబాలకు వాకిటకు వెళితేనే.. వారికి మనుగడ ఉంటుంది. లేకపోతే.. ఈ రకమైన అన్నదాత శోకం ఎప్పటికైనా వారికి శాపంగా మారుతుంది.