Begin typing your search above and press return to search.

జీఎస్టీలో తెలంగాణ స్పీడ్ చూశారా!

By:  Tupaki Desk   |   18 July 2017 10:47 AM GMT
జీఎస్టీలో తెలంగాణ స్పీడ్ చూశారా!
X
న‌రేంద్ర మోదీ స‌ర్కారు కొత్త‌గా తెచ్చిన వ‌స్తు, సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ) అమ‌లు విష‌యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా కొత్త రాష్ట్ర‌మైన తెలంగాణ దూకుడు పెంచేసింది. జీఎస్టీ బిల్లు చ‌ట్టంగా మారే స‌మ‌యంలో ఆ కొత్త ప‌న్నుపై కాస్తంత నిర‌స‌న వ్య‌క్తం చేసిన తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకున్నారు. తొలుత జీఎస్టీ వ‌ల్ల తెలంగాణ‌కు భారీ న‌ష్ట‌మేనంటూ గ‌ళం విప్పిన కేసీఆర్‌... ఆ త‌ర్వాత జీఎస్టీ అమ‌లు ద్వారా రాష్ట్రానికి తాత్కాలికంగా కాస్త న‌ష్ట‌మే అయినా... దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల విష‌యంలో మెరుగైన వృద్ధి సాధ్య‌మేన‌ని తేల్చేశారు. ఈ దిశ‌గా ఆయ‌న చెప్పిన గ‌ణాంకాలు నిజంగానే ఆర్థిక వేత్త‌ల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేశాయ‌ని చెప్పాలి.

ఇదంతా గ‌త‌మైతే... ఇప్పుడు జీఎస్టీని అమ‌లు చేసే విష‌యంలో తెలంగాణ దూకుడైన వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. గ‌డ‌చిన 15 రోజుల్లోనే 90 శాతం మంది వ్యాట్ ఖాతాదారుల‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకొచ్చేసిన తెలంగాణ స‌ర్కారు... 1.92 ల‌క్ష‌ల మందిని జీఎస్టీతో అనుసంధానం చేసేసింది. ఫ‌లితంగా జీఎస్టీ అమ‌లులో వేగ‌వంత‌మైన పురోగ‌తి సాధించిన అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్ర‌గామిగా నిలిచింది. దీనిని గుర్తించిన‌ కేంద్ర ప్ర‌భుత్వం కూడా తెలంగాణ స‌ర్కారు ప‌నితీరును ఆకాశానికెత్తేసింది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని అధికార యంత్రాంగంతో కాసేప‌టి క్రితం కేసీఆర్ ప్ర‌త్యేకంగా స‌మావేశం నిర్వ‌హించారు.

జీఎస్టీ అమ‌లులో రాష్ట్రాన్ని అగ్ర‌భాగాన నిలిపిన అధికారుల‌ను అభినందించిన కేసీఆర్‌.. ఈ నెలాఖ‌రులోగా వంద‌శాతం జీఎస్టీ రిజిస్ట్రేష‌న్లు పూర్తి చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అధిక శాతం మంది ఆధార‌ప‌డ్డ‌ వ‌స్త్ర‌ - గ్రానైట్‌ - బీడీ ప‌రిశ్ర‌మల‌ను మిన‌హాయించాల‌ని డిమాండ్ చేశామ‌ని తెలిపారు. జీఎస్టీతో వీరికి వ్య‌తిరేక ఫ‌లితాలుంటాయని కేంద్రానికి తెలిపామ‌న్నారు. త‌మ డిమాండ్‌కు సానుకూలంగా స్పందించాల‌ని కోరుతున్న‌ట్లుగా ఆయ‌న చెప్పుకొచ్చారు.