Begin typing your search above and press return to search.

రాజ‌ధాని మెట్రోపై హాట్ అప్‌ డేట్‌

By:  Tupaki Desk   |   26 Nov 2015 4:19 PM GMT
రాజ‌ధాని మెట్రోపై హాట్ అప్‌ డేట్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌న‌సు మార్చుకున్నారు. త‌న చెప్పిన మాట‌, ప‌ట్టిన ప‌ట్టు విష‌యంలో ఏమాత్రం త‌గ్గని కేసీఆర్ హైద‌రాబాద్ మెట్రో రైలు రూట్ మార్చాలనే ప్రతిపాదనలపై వెనక్కి తగ్గారు. పాత మార్గంలోనే మెట్రో నిర్మాణాన్ని కొన‌సాగించాలా లేక‌పోతే కొత్త రూట్‌ లో ప‌నులు చేప‌ట్టాలా అనే విష‌యంలో అంగీకారం తెల‌ప‌డ‌మే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.

హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడాలు - దేవాలయాలు - ముస్లింల ప్రార్థనామందిరాలు - ప్రజల మనోభావాలతో ముడిపడిన ఇతర చిహ్నాలకు ఎలాంటి విఘాతం కలగకుండా ‘మెట్రో’ నిర్మాణాన్ని పూర్తి చేయాల‌ని ప‌లు వ‌ర్గాల నుంచి డిమాండ్లు వినిపించాయి. ఉద్య‌మ‌కారుడిగా ఉన్న స‌మ‌యంలో ఈ డిమాండ్ల‌కు సై అని చెప్పిన టీఆర్ ఎస్ అధినేత‌ - ముఖ్యమంత్రి అయిన త‌ర్వాత వాటిపై క‌స‌ర‌త్తు షురూ చేశారు. ఆయా ప్రాంతాల గుండా వెళితే క‌లిగే న‌ష్టం త‌దిత‌ర అంశాల‌పై ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ చ‌ర్చించారు. సుల్తాన్ బజార్ - అసెంబ్లీ - ఓల్డ్ సిటీలో మెట్రో రూట్ ల‌పై ఈ పేచీ మొద‌లైన నేప‌థ్యంలో ఈ మూడుచోట్ల మెట్రోరైలు మార్గాన్ని మార్చాలని నిర్ణ‌యం తీసుకున్నారు. సుల్తాన్ బ‌జార్‌లో వ్యాపారులు త‌మ నిర‌స‌న వ్య‌క్తంచేయ‌గా...పాతబస్తీలో అలైన్‌ మెంట్ మార్పునకు సంబంధించి ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప‌ట్టుబ‌ట్టారు. అసెంబ్లీ మార్గంపై అమ‌ర‌వీరుల స్థూపం, అసెంబ్లీ చారిత్ర‌క క‌ట్ట‌డం అనే అంశం ఇబ్బందిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో మెట్రో ప‌నుల‌పై విప‌రీతమైన అస్ప‌ష్ట‌త కొన‌సాగింది. తాజాగా ఈ విష‌యంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.

గ‌తంలో ప్ర‌తిపాదించిన‌ట్లే సుల్తాన్ బజార్ - అసెంబ్లీ మీదుగానే పరుగులు తీయించటానికి ఓకే చెప్పారు. అసెంబ్లీ - సుల్తాన్ బజార్ మీదుగా వెళ్లే రూట్ మార్చాలనే డిమాండ్‌ ల నేప‌థ్యంలో ఎల్ ఆండ్ టీ పనులను కూడా నిలిపివేసింది. ఈ క్ర‌మంలోనే ప‌లు ద‌ఫాలుగా ప్రభుత్వం- కంపెనీ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. తాజాగా పాత రూట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేప‌థ్యంలో ఎల్ అండ్ టీ ఎండీ గాడ్జిల్ మాట్లాడుతూ...ప్రభుత్వం ఆదేశాలతో వెంటనే పనులు చేపడతామని ప్రకటించారు. ఓల్డ్ సిటీలో మెట్రో రూట్ పై ఇంకా క్లారిటీ రాలేదని.. చర్చలు కొనసాగుతున్నాయని ఆయ‌న‌ స్పష్టం చేశారు!