Begin typing your search above and press return to search.

నయిం కేసుల్ని మొత్తంగా మూసేస్తున్నారోచ్

By:  Tupaki Desk   |   14 Feb 2017 5:05 AM GMT
నయిం కేసుల్ని మొత్తంగా మూసేస్తున్నారోచ్
X
ప్రభుత్వం ఏదైనా పరిణామాలు ఒకేలా ఉంటాయన్న విషయం మరోసారి రుజువు చేసే ఉదంతంగా చెప్పొచ్చు. కొత్త రాష్ట్రం ఏర్పడినా.. కొత్త రాజకీయం తెర మీదకు వచ్చినా.. అంతిమ ఫలితం అయితే ఒక్కటే.. పెద్దగా తేడా ఉండదన్న విషయం తేలిపోయినట్లేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నయిం ఉదంతంలో మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే నయింతో అంటకాగిన ప్రముఖుల్ని పక్కకు తప్పించటంలో విజయవంగా వ్యవహరించారన్న పేరును ప్రఖ్యాతల్ని తెలంగాణ సర్కారు సొంతం చేసుకోవటం తెలిసిందే. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడి లాంటి నయింతో సన్నిహిత సంబంధాలున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తిన రాజకీయ నేతలు.. అధికారులపాత్రలపై ఆధారాలు లేవంటూ చెప్పిన ఒక్క మాటతో అప్పటివరకూ ఉన్నకేసుల లెక్క మొత్తంగా పోయిన పరిస్థితి.

పెద్దల్నిపక్కకు తప్పించటంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న విమర్శలకు తగ్గట్లే.. తాజాగా నయిం సాగించిన ఆరాచకాల పైనా పోలీసుల పాత్రపై విమర్శలు వెల్లువెత్తేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నయిం ఆరాచకాలపై నమోదైన కేసులకు సంబంధించి ఆధారాలు లేవంటూ నమోదైన కేసుల్ని మూసివేసే ప్రక్రియ జోరందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి న్యాయస్థానాల్ని ఆశ్రయించినట్లుగా చెబుతున్నారు.

నయిం ఎన్ కౌంటర్ తర్వాత.. అతగాడి దారుణాల గురించి ఫిర్యాదులు పోటెత్తాయి. బాధితులు పోలీస్ స్టేషన్లవైపు బారులు తీరారు. మొత్తంగా నయిం బాధితులకుసంబంధించి 174కేసుల్ని నమోదు చేసి 124 మందిని అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసుల విచారణ దశను దాటి ముందుకు వెళ్లేలా లేవన్న మాట వినిపిస్తోంది. కేసులకు సంబంధించిన ఆధారాలు లేవన్న మాటతో కేసుల్ని కంచికి పంపించే పనిలో అధికారగణం పడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తగ్గట్లే ఇప్పటికే కొన్ని కేసుల్ని ఇదే తీరులో కంచికి పంపించేశారని చెబుతున్నారు. రానున్న రోజుల్లో మిగిలిన కేసులకు అదే గతి పడుతుందన్న మాట వినిపిస్తోంది. మరీ.. విషయంలో గొప్పలు చెప్పుకునే కేసీఆర్ ఏం సమాధానం చెబుతుంది..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/